Breaking News

దివ్యధాత్రి సేవకై యువభారత స్ఫూర్తి

(జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా 12 జనవరి 2023 ను ఉద్దేశించి )

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2023, ప్రపంచమంతా ఉత్సాహంగా జరుపుకునే అతిపెద్ద వేడుకగడిచి రెండువారాలైనా కాలేదు. చాలామంది గతసంవత్సరం సాధించిన విజయాలు, వైఫల్యాలను గుర్తుచేసుకుంటూ కొత్తసంవత్సరం అందించే గొప్పప్రారంభం గురించి ఆశగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో భారతదేశం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నిర్వహించుకుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక యువతకలిగిన దేశంగా పేరొందిన మనదేశంలో ఈ సందర్భం అత్యంతప్రాధాన్యత కలిగిఉంది.
2047నాటికి భారతదేశం అభివృద్ధిచెందుతున్న దేశస్థాయినుంచి అభివృద్ధిచెందినదేశంగా రూపాంతరంచెందాలన్న లక్ష్యంతో పురోగమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన నేపధ్యంలో దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించే యువతకు స్వామీ వివేకానందుని బోధనల అవసరం గతంకంటే ఎక్కువగా ఉంది.
తనజీవితకాలంలో కాలినడకన దేశమంతా పర్యటించిన స్వామి వివేకానందుడు ప్రజల అజ్ఞానం, దయనీయ దుస్థితిని కళ్ళారాచూశాడు. వలసపాలనలో ఆకాలానికే అవసరమైనట్టు కాకుండా సార్వజనీన జాతీయవాద స్పృహను ప్రేరేపించిన ఘనత ఆయనదే. ఆయన అభిప్రాయాలు, బోధనలు మంచి భవిష్యత్తువైపు బాటలు వేయడానికి సహాయపడతాయి. తన జ్ఞానాన్ని మానవాళి అభ్యున్నతికోసం వ్యాప్తి చేయడానికి అంకితంచేసిన మహనీయుని కొన్ని ఆలోచనలు, ప్రస్తుతపరిస్థితులలో ఎదురయ్యేసవాళ్ళకు జవాబులౌతాయి. అన్నికాలాల సమాజం, ప్రధానంగా యువత, వారినుండి అనంతంగా స్ఫూర్తి పొందగలరనే వాస్తవాన్ని ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయి. స్వామీ వివేకానంద అనేక సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త. ఈ ప్రయోజనం కోసం లింగ, కుల ప్రాతిపదికన వివక్షచూపని హిందూమతాన్ని సమర్థించాడు, అర్ధవంతమైన జీవితాన్ని ఎలా గడపాలనే ఆలోచనలను ముందుకు తెచ్చాడు.
మనదేశానికి స్వాతంత్రం అందినా నేటికీ ఆకలి, అవిద్య అంతుచిక్కకుండా అలానే ఉన్నాయి. భారతదేశ ఆలోచనను నకిలీ లౌకికవాదులు, మత ఛాందసవాదులు, తీవ్రవాదులు కుహనా రాజకీయనాయకులు సవాలు చేస్తున్న వర్తమాన పరిస్థితుల్లో వివేకానంద జాతీయవాద భావనలు గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
స్వామీ వివేకానందది ఆచరణాత్మక పంథా. ‘దేశభక్తి అంటే మాతృభూమిపై భావోద్వేగం కాదు, మన తోటిదేశస్థులకు, సాటి మానవులకు అంతరాలు చూడకుండా సేవ చేయాలనే అభిరుచి’. “లక్షలమంది ఆకలి, అజ్ఞానంతో జీవిస్తున్నంత కాలం, నేను ప్రతిమనిషిని దేశద్రోహిగానే ఎంచుతాను” అన్నారు. ప్రపంచస్వభావాన్ని అందులో నివసించేమానవులే నిర్ణయిస్తారని ఆయన నమ్మారు కాబట్టి, మానవాళి అంతా ఒకరిపట్ల మరొకరు సానుభూతితో ఉండితీరాలంటారు. మతమంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే అన్నది వారి నిర్వచనం. వ్యక్తిగత, సంస్థాగత స్థాయిలలో విభిన్న మతసంప్రదాయాలు, విభిన్న ఆధ్యాత్మిక, మానవతావిశ్వాసాలు గల వ్యక్తులమధ్య సహకార, నిర్మాణాత్మక, సానుకూల పరస్పరచర్యలను అభిలషించడం ఈకాలపు అవసరం. ‘మానవాళి అంతా ఒకరిపట్ల మరొకరు సానుభూతితో ఉండి, ఇతరుల శ్రేయస్సు కోసం పనిచేయాలని విశ్వసిస్తే, ప్రపంచం కూడా మన పట్ల దయతో ఉంటుంది’-స్వామి వివేకానంద బోధనల్లో ఇది అతి శక్తివంతమైనది. ఇది తోటిమానవులపట్ల వినయపూర్వకంగా, సహాయకారిగా ఉండటానికి, అవసరమైనవారికి సహాయం చేయడాన్ని బోధిస్తుంది.
వివేకానందుడు నైతికతను జ్ఞానంతో ముడిపెట్టాడు, సత్యం, స్వచ్ఛత, నిస్వార్థతను దానిని మెరుగుపరిచే లక్షణాలుగా పరిగణించాడు. అతను తన శిష్యులను పవిత్రంగా, నిస్వార్థంగా ఉండాలని ప్రోత్సహించాడు. “బలమే జీవితం, బలహీనతే మరణం. విస్తరణ జీవితం, సంకోచం మరణం. ప్రేమే జీవితం, ద్వేషమే మరణం.” -ఇది వారి అత్యంత ప్రాచుర్యం లో ఉన్న సందేశం. యువత తమ శక్తియుక్తులను, సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని సానుకూలంగా అభివృద్ధి చేయాలని స్వామి వివేకానంద కోరారు. నిజాయితీ ఉత్తమమైనవిధానం అంటూ “సత్యం కోసం ప్రతిదీ త్యాగం చేయవచ్చు, కానీ దేని కోసమూ సత్యాన్ని త్యాగం చేయలేము.”అన్న ఆలోచనను సమర్థించారు. అతని ప్రకారం, మనకు ఎదురయ్యే పరిస్థితులు ఎలాఉన్నా మనమందరం నిజాయితీగా ఉండాలి. సహజంగానే, మనచర్యలు ఎల్లప్పుడూ కొన్ని పరిణామాలను కలిగి ఉంటాయి కానీ మనం వాస్తవాన్ని వక్రీకరించలేం. జీవితాన్ని జీవించడానికి ఏకైకమార్గం నిజాయితీ ఆధారంగా స్థాపించబడిన మార్గంలో నడవడం. స్వీయ ఆత్మపరిశీలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, “రోజుకు ఒకసారి మీతో మాట్లాడుకోండి, లేకుంటే మీరు ఈ ప్రపంచంలో తెలివైన వ్యక్తిని కలవడం మానేయవచ్చు.” అంటారు. స్వామి వివేకానంద ఈ బోధనను మనమందరం మన జీవితంలోని ప్రతి మెలకువలో అనుసరించాల్సిన అవసరం ఉంది.
“మీ జీవితంలో మీరు ఏమి చేసినా మీరు మీతో ప్రశాంతంగా ఉండాలి. మీ జీవితం నుండి మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడానికి, లోపల ఉన్న అవకాశాలను కనుగొనడానికి మీరు స్వీయ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే సామర్థ్యం మీకు మాత్రమే ఉంది” అని వివేకానంద నమ్మారు. మీరు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి, మీ అంతరంగిక కోరికలను అర్థం చేసుకుంటూ ఉండాలి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తమ సంస్కరణగా ఉండండి. ఇతరుల నుండి మంచి ప్రతిదీ నేర్చుకోండి, కానీ దానిని యధాతధంగా స్వీకరించకండి, “మీ స్వంత మార్గంలో దానిని గ్రహించండి; మీరు మీరుల ఉండండి కానీ ఇతరులు కావద్దు.” “మీకు ఎప్పుడైనా ఏదైనా భయం అనిపిస్తే, ఎదురుతిరగండి, దానిని ఎదుర్కోండి. పారిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు.” “ఇబ్బందులను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు నమ్మండి. విశ్వంలోని అన్ని శక్తులు ఇప్పటికే మనవి. కళ్లముందు చేతులు పెట్టుకుని చీకట్లు కమ్ముకున్నది మనమే.” ఇవి వివేకానందుడి కొన్ని బోధనలు.
వివేకానందుని అంతరంగం – జీవితం మంచి, చెడు రెండింటినీ కలిగి ఉంటుందని అంగీకరించడం, మంచి రోజులు రావాలంటే చెడు రోజులలో ప్రయాణించేంత బలంగా ఉండాలి అంతస్సూత్రంతో నిండిఉంది. మీరు ఈ ద్వంద్వాన్ని అంగీకరించినట్లయితే, మీరు ప్రపంచాన్ని ఎదుర్కొనేశక్తితో నిండిపోవడమేకాకుండా కష్టాలనేపథ్యంలో మరింత సానుకూలంగా ఉంటారు. మీరు మీజీవితాన్ని సంపూర్ణంగా జీవించాలనుకుంటే, మీకు దృష్టికివచ్చిన ప్రతిదాన్ని మీరు ఎదుర్కోవాలి, వాటి నుండి పారిపోకూడదని వివేకానంద నమ్మారు. “మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే, ముందుగా మిమ్మల్ని మీరు విశ్వసించాలని” చెప్పిన స్వామి వివేకానంద బోధన ప్రతిమనిషికి తమలో ఉన్న సామర్థ్యాన్ని గ్రహించడానికి శక్తినివ్వడానికి ఉద్దేశించింది, మీకు మీపై నమ్మకం ఉంచాలి, ఇతరుల అభిప్రాయాలను తీసుకోకుండా, మీ నమ్మకాలను వీడకుండా మీకు సరైనది అని మీరు భావించే మార్గంలో నడవాలి. నిజమైన ఆనందం నిస్వార్థంగా ఉండటం వల్ల వస్తుంది. మీరు నిస్వార్థ దయతో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకుంటే, మీరు అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు.
స్వామి వివేకానంద ఉత్తమవ్యక్తిత్వం అనే ఆలోచనను ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండవలసిన కొన్ని నైతిక నియమాలు ఉన్నాయని వారునమ్మారు, అయితే ఏ విషయాన్నీ గుడ్డిగా అనుసరించకూడదని, విన్నదాన్ని ప్రశ్నించాలి, విశ్లేషించాలి, జీవితంలోకి చేర్చుకోవాలి అన్నది వారి ఉద్దేశం. ఒకరికొకరు భిన్నంగా ఉంటాము తద్వారా విషయాలను చూసే వ్యక్తిగత దృక్పథాన్ని కలిగిఉన్నాము అనే ఆలోచనను ప్రచారం చేశారు.
1863 జనవరి 12న జన్మించి, 1902 జూలై 4 వరకూ జీవించిన స్వామి వివేకానంద కేవలం 39 ఏళ్ల జీవితం గడిపారు. వారిసందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. వారి జన్మదినమైన జనవరి 12న దేశమంతా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం సముచితం. జాతీయ యువజన దినోత్సవం యువతకు అంకితమైన ప్రత్యేకరోజు. యువకులకు అవగాహన, బాధ్యతను ప్రోత్సహించడమే ఈ రోజు ఉద్దేశం. ఇది సామాజిక సంకల్పాన్ని ప్రోత్సహిస్తుంది, కార్యక్రమాలు, వేడుకల ద్వారా విద్యకు మద్దతు ఇస్తుంది. జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం పాఠశాలలు, కళాశాలల్లో జరుపుకుంటారు. ఊరేగింపులు, యువజన సమావేశాలు, ప్రసంగాలు, సంగీతం, సెమినార్లు, ఇతర కార్యక్రమాలు జనవరి 12న జాతీయ యువజన దినోత్సవ స్ఫూర్తిని సూచిస్తాయి. అంతేకాకుండా, దేశనిర్మాణంలో యువత ముఖ్యమైన పాత్ర పోషించేందుకు, స్వామీజీ జన్మదినాన్ని గుర్తుంచుకోవడానికి, యువకులకు ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలను ఈ సందర్భం తెరిచి ఉంచింది. ఈ రోజు యువకులకు తమభావాలను వ్యక్తీకరించడానికి, వారిలక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందిస్తుంది. వారిమాటల్లోనే-దేశగతిని మార్చే అంకితభావం ఉన్న వందమంది యువకులకోసం ఈ రోజు దేశం ఎదురుచూస్తుంది. అందులో ఎవరు ఉండాలో ఎవరికివారు తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పటికీ సమయం మించిపోలేదు. దేశం నీకోసం ఎదురుచూస్తుంది, యువతా మేలుకో!—యశస్వి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *