తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కీర్తి కిరీటాల్లో నిలిచిన కొద్ది మందిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర భోస్ ఒకరని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం నేతాజీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ , జేసి డి.కె.బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు , జిల్లా అధికారులు నేతాజీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేతాజీ జయంతిని ప్రతి ఏటా పరాక్రమ్ దివాస్ గా జరుపు కోవడం ఆనవాయితీ అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఆయన పోరాటం ఎనలేనిదని అన్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి విడిపించుటకు అహింస మార్గం ఒక్కటే కాకుండా విప్లవ సాయిధ పోరాటం కూడా అవసరమని భావించిన వ్యక్తి అని అన్నారు. 1920లో సివిల్స్ లో నాల్గవ ర్యాంకు సాధించినా కూడా స్వాతంత్ర సమరం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసారని తెలిపారు. ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా , భారత జాతీయ సైన్యం నాయకుడిగా , ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థ ను స్థాపించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి తన జీవితాన్ని ఫణంగా పెట్టిన మహనీయులు అని ఆయన్ని స్మరించుకోవడం మన విధి అని అన్నారు.
Prajavartha Online Telugu News