గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి తరానికి స్వాతంత్రోద్యమ స్పూర్తిని అందించడానికే “దండి మార్చ్” విగ్రహాలను గుంటూరు నగరంలోని కాకాని వై జంక్షన్ నందు ఏర్పాటు చేయుట జరిగిందని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తెలిపారు. ఈ నెల 26 న ఆవిష్కరించనున్న దండి మార్చ్ విగ్రహ ఏర్పాట్లను యం.యల్.సి లేళ్ళ అప్పిరెడ్డి, నగర కమీషనర్ కీర్తి చేకూరి లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినందున అజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రజలలో స్వాతంత్ర్య స్పూర్తిని ప్రోత్సహించడం, నాటి స్వాతంత్ర్యం పోరాట యోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయడానికి నగర పాలక సంస్థ దండి మార్చ్ విగ్రహాలను ఏర్పాటు చేసినదని తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా గుంటూరు నగరంలో కాకాని వై జంక్షన్ వద్ద 18 అడుగుల ఎత్తుతో జాతిపిత మహాత్మా గాంధీ మరియు 8 శిల్పాలతో కూడిన దండిమార్చ్ నిర్మాణం పూర్తి చేయుట జరిగిందని తెలియచేశారు. కాకాని వై జంక్షన్ లో నే కాక గుంటూరు సిటీ లో కూడా ఇటువంటి ప్రతిమలను ఏర్పాటు చేయుట జరిగిందని తెలియచేశారు. సదరు దండి మార్చ్ విగ్రహాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించుట జరుగుతుందన్నారు.
యం.యల్.సి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం నాడు ఎందరో అనేక ఉద్యమాలను నిర్వహించారని, వాటిలో ముఖ్యంగా దండి మార్చ్ ఎంతో ముఖ్యమైనదని, ఇటువంటి దండి మార్చ్ ప్రతిమలను గుంటూరు నగరంలో ఏర్పాటు చేయుట వలన ప్రజలకు స్వాతంత్ర్య స్పూర్తిని పెంపొందించవచ్చునన్నారు. గుంటూరు జిల్లాకు పోరాటాల పురిటిగడ్డ అని పేరు ఉందని, స్వాతత్ర్య ఉద్యమంలో గుంటూరు జిల్లా కూడా ముఖ్య పాత్ర వహించిందని అటువంటి నగరంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయుటలో ముఖ్య పాత్ర వహించిన నగర మేయర్, కమీషనర్లు ఎంతో అభినందనీయులని తెలియచేశారు. ఈ విగ్రహాల ఏర్పాటు వలన ప్రతి ఒక్కరిలో జాతీయతాభావం పెల్లుబుకుతుందన్నారు. దేశానికి త్యాగాల వలన స్వాతత్ర్యం వచ్చిందని, అనేక మంది దేశ భక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతత్య్రం కోసం కష్ట పడ్డారని, వారి త్యాగాలను నేటి తరాలకు అర్ధమయ్యేలా ఈ ప్రతిమలు ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ క అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుంటూరు నగరంలోని హిందూ కాలేజి సెంటర్ వద్ద మరియు కాకాని వై జంక్షన్ వద్ద స్వాతత్ర్య ఉద్యమ నాయకుల ప్రతిమలను ఏర్పాటు చేయుట జరిగిందన్నారు. ఆ నాటి ఉద్యమంలో ఈ దండి మార్చ్ కులమతాలకు అతీతంగా అన్ని కులాల వారు గాంధీ మార్గం నడిచి స్వాతంత్ర్యాన్ని సాధించారని తెలియచేశారు. అదే స్పూర్తి నేటి ప్రజలలో పెంపొందించుటకు ఈ దండి మార్చ్ విగ్రహాలు ఎంతగానో దోహద పడతాయన్నారు.
సదరు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్ర బాబు, కార్పొరేటర్లు కామిరెడ్డి రంగా రెడ్డి, పఠాన్ రిహాన, యస్.ఈ భాస్కర్, డి.సి.పి కోటయ్య, ఏ.డి.హెచ్. రామారావు, షేక్ నూరి ఫాతిమా,నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News