-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-23 వ డివిజన్ 98 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేద కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 23 వ డివిజన్ 98 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం 160 గడపలను సందర్శించి ప్రతిఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వినతులు స్వీకరించారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. శేషాద్రి శాస్త్రి వీధి, మ్యూజియం రోడ్డు, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, దుర్గయ్య వీధి, కస్పా వారి వీధులలో విస్తృతంగా పర్యటించి.. పారిశుధ్య నిర్వహణ తీరు, డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల విధానాన్ని పరిశీలించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య భూమిక పోషిస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. సచివాలయ పరిధిలో రూ.3 కోట్ల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టీడీపీది అనవసర రాద్ధాంతం
నవరత్నాల పథకాల ద్వారా నగరంలో వేలాది కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తుంటే ఓర్వలేక టీడీపీ సభ్యులు కౌన్సిల్ లో రాద్ధాంతం చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే రెట్టింపు పింఛన్లను ప్రతి డివిజన్లోనూ ఈ ప్రభుత్వం అర్హులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లే ఇందుకు నిదర్శనమన్నారు. 45వ డివిజన్లో 1,035., 52వ డివిజన్లో 1,564., 60వ డివిజన్లో 2,090., 32వ డివిజన్లో 903., 8వ డివిజన్లో 489., 9వ డివిజన్లో 482., 10వ డివిజన్లో 436., 11వ డివిజన్లో 1,076., 12వ డివిజన్లో 841., 13వ డివిజన్లో 830 పింఛన్లను ఇంటివద్దకే ప్రతినెలా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కానీ తెలుగుదేశం సభ్యులు కావాలనే రాద్ధాంతం చేస్తూ.. ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తే తప్ప టీడీపీ నేతలకు పింఛన్ దారులు గుర్తురారని.. అలాంటి మీరు రూ.2,750 అందజేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా..?
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ప్రతి ఒక్క పార్లమెంట్ సమావేశంలోనూ వైఎస్సార్ సీపీ ఎంపీలు శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. స్వార్థపూరిత ఆలోచన విధానాలతో ఆనాడు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. కానీ నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచింది వైఎస్సార్ సీపీ పోరాటమేనని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు మా పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసినప్పుడు కలిసి రాకపోగా.. మా పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి తీసుకున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ.. ప్యాకేజీ చాలని చెప్పిన మాట వాస్తవమా..? కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. మరలా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినందుకు ప్రజలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, పసుమర్తి రాజేష్, కొల్లిపర శ్రీను, వడ్డీ వాసు, అన్సారీ, చాందిని, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News