విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రమం తప్పక మందులు వాడడంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య వంతులు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ, ఇండియన్ మెడిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ ఆవరణంలో 200 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు, కలెక్టర్ డిల్లీరావు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణను కేంద్ర రాష్ట్ర ఫ్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా నిక్షయ మిత్ర కార్యక్రమంలో 200 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా పోషకాహార కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా క్షయ వ్యాధితో బాధపడుతున్న బాధితులు ఉన్నారని, వారందరికి పౌష్టికాహార కిట్లను అందించి, రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా ఆరు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. క్షయ వ్యాది పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలన్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గకుండా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. క్రమం తప్పక మందులను వాడడం ద్వారా క్షయ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చునన్నారు. విటమిన్లు, మినరల్స్, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధకశక్తి పెరిగి క్ష్షయ వ్యాధిని దరిచేరకుండా పరిరక్షించుకోగలమన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులను ఆశ్రద్ద చేయకుండా వాడుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలకు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు. ప్రాణాంతకమైన అంటువ్యాధి అయిన క్షయ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందన్నారు. పౌష్టికాహారన్ని తీసుకుని వ్యాధిగ్రస్తులు త్వరితగతిన కోలుకుని ఆరోగ్యవంతులు కావాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమకూర్చిన 16 డిజిటల్ హిమోగ్లోబిన్ ఎనలైజర్లను వార్డు హెల్త్ సెక్రటరీలకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా. జి. సమరం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా. యం సుహాసిని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెహమాన్, కార్యదర్శి డా. మనోజ్, జిల్లా టిబి కంట్రోలింగ్ అధికారి డా. ఉషారాణి ఉన్నారు.
Prajavartha Online Telugu News