-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-57 వ డివిజన్ 233 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హతే ప్రామాణికంగా కులమతాలు, పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 57 వ డివిజన్ 233 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. న్యూ ఆర్.ఆర్.పేట, సుబ్బరాజు నగర్లలో విస్తృతంగా పర్యటించి.. 250 గడపలను సందర్శించారు. మూడున్నరేళ్లలో అందించిన సంక్షేమాన్ని పుస్తక రూపంలో లబ్ధిదారులకు వివరించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కొల్లి ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ రైతు భరోసా, ఆసరా, వసతి దీవెన, సున్నా వడ్డీ, విద్యాదీవెన, వాహనమిత్ర పథకాలు వర్తిస్తునట్లు చెప్పారు. గంధం చిన్నారి మాట్లాడుతూ.. మూడున్నరేళ్లలో తమ కుటుంబానికి రూ. 9 లక్షల 60 వేల లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. మజ్జి కరుణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి వచ్చేదని, కానీ ఈ ప్రభుత్వంలో డోర్ డెలివరీ విధానంతో వ్యయప్రయాసలు తప్పాయని చెప్పుకొచ్చారు. ఆదర్శ పరిపాలన ఎలా ఉండాలో సీఎం జగన్ చేతల్లో చేసి చూపారన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు చెప్పారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని.. ప్రజల కష్టాలు తీర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. ఈ ప్రభుత్వం అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. అస్తవ్యస్థంగా ఉన్న పద్మావతి ఎన్ క్లేవ్, లక్ష్మీ ఎన్ క్లేవ్ రహదారుల నిర్మాణాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అలాగే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 8 వీధులలో రోడ్లు, త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వివరించారు.
బఫర్ జోన్ లోని కుటుంబాలు ఆందోళన చెందాల్సిన పనిలేదు
న్యూ రాజరాజేశ్వరి పేట గూర్చి మాట్లాడే అర్హత తెలుగుదేశం నేతలకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ల పేరుతో గత పాలకులు ఈ ప్రాంత ప్రజలను నిలువునా మోసగించారని ఆరోపించారు. ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దశాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు జీవో నెం. 60 ద్వారా శాశ్వత పరిష్కారం చూపడం జరిగిందన్నారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో 2,986 మందికి లబ్ధి చేకూరనున్నట్లు వివరించారు. సుబ్బరాజునగర్లో 103 మంది నివాసితులకుగానూ.. 64 మంది రైల్వే బఫర్ జోన్ లో ఉండగా 39 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. అరుణోదయ నగర్లో 79 మంది నివాసితులకు గానూ.. 32 మంది బఫర్ జోన్ లో ఉండగా, 47 మంది అర్హులు ఉన్నట్లు తెలిపారు. వీరందరికీ నామమాత్రపు రుసుము గజానికి కేవలం రూ. 100 కే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అలాగే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు వీలుగా హక్కుతో కూడిన పట్టా అందజేయడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతానికి ఒక సబ్ రిజిస్ట్రార్ ను కూడా ప్రత్యేకంగా నియమించినట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. బఫర్ జోన్ లోని 96 కుటుంబాలు సైతం ఆందోళన చెందవలసిన అవసరం లేదని.. రెవెన్యూ, వీఎంసీ అధికారులతో మాట్లాడి పట్టాలు ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. మరోవైపు తెలుగు చలనచిత్రానికి ఆస్కార్ అవార్డు వరించడం గర్వించదగ్గ విషయమని మల్లాది విష్ణు అన్నారు. కానీ నిత్యం ఏడుపే ఏడుపు కార్యక్రమాలతో నవరసాలు పండిస్తున్న చంద్రబాబుని ఆస్కార్ అవార్డుకు ఎంపిక చేయకపోవడం బాధాకరమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ కాళ్ల ఆదినారాయణ, నాయకులు చెన్నకేశవరెడ్డి, చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోవింద్, ప్రేమ్ కుమార్, ఎన్.ఎస్.ఆర్, మురళి, గౌస్య బేగం, టి.బాల, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News