-ఢిల్లీ స్థాయిలో ఉద్యమానికి కార్యాచరణ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
-రెండవ రోజు కొనసాగిన నిరసన దీక్షలు
-సీపీఐ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించిన అఖిలపక్షాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశంపై లోక్‌సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరో విధంగా సమాధానం చెపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుందని అఖిల పక్షాల నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు 41.5 అడుగులకు కుదిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాలి డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం రెండవ రోజు కొనసాగింది. దానిలో భాగంగా మంగళవారం సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్‌లో నిరసన దీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభించారు. సీపీఐ పోరాటానికి అఖిలపక్ష పార్టీల నేతలు పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారనే సమాచారంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. తన తండ్రి శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్ మాట నిలబెట్టుకోవాలన్నారు. లేని పక్షంలో పోలవరం ఎత్తు తగ్గిస్తే చరిత్రహీనుడుగా జగన్ మిగులుతాడని హెచ్చరించారు. బీజేపీ నాయకులు రాజధాని విషయంలో మాటతప్పారని మండిపడ్డారు. రాజధాని రైతుల పాదయాత్రలో రాష్ట్ర నాయకులు పాల్గొంటారు కేంద్రంలోని నాయకులు రాజధాని గురించి మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాజయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేదు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు అంశాన్ని పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు 15శాతం నిధులు కేటాయించమంటే కేవలం 4.6శాతం నిధులు కేటాయించారని తెలిపారు. పోలవరానికి నిధులు రాబట్టి ప్రాజెక్టు పూర్తి చేయటం సీఎం ఒక్కడివల్ల అయ్యే పనికాదని అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాని సీఎంకు సూచించారు. రైతు సంఘాల నాయకులతో చర్చించి పోలవరం పూర్తిస్థాయి నిర్మాణం చేయాలనే డిమాండ్‌తో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. గేటు కూడా పెట్టలేని వారు ప్రాజెక్టు ఎలా నిర్మించగలరు: దేవినేని ఉమా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం కోసం టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో 68వేల కోట్లు ఖర్చుచేసి 71శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డ్యామ్‌సైట్‌లో 15 నెలల పాటు ఎలాంటి పనులు చేయకుండా గాలికొదిలేశారన్నారు. నేషనల్ వాటర్ కౌన్సిల్(సీడబ్ల్యూసీ), హైదరాబాద్ ఐఐటీ వారు వచ్చి చెప్పేవరకు పోలవరం ప్రాజెక్టు పరిస్థితి సీఎంకుగాని, అధికారులకుగాని తెలియదన్నారు. పులిచింతల, గుండ్లకమ్మకు గేట్లు పెట్టలేని వారు పోలవరం ఎలా నిర్మించగలరన్నారు. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు వదలకు కొట్టుకుపోయినా వాటిపై వైసీపీ ప్రభుత్వానికి చీయకుట్టినట్లు లేదన్నారు. పోలవరానికి తప్ప దేశంలో ఏ ప్రాజెక్టుకు కేంద్రం 13,500 కోట్ల రూపాయలు ఇవ్వలేదన్నారు. పోలవరానికి భూములిచ్చిన గిరిజనులే నిజమైన దేవుళ్లు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రైవేటు స్కూల్స్ టీచర్స్‌తో టీచర్ ఎమ్మెల్సీతో విజయం సాధించారన్నారు. అయితే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక విషయంలో వైసీపీ ప్రభుత్వానికి గూబగుయ్యీమనిపించారని ఎద్దవ చేశారు. సీపీఐ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించి అనంతరం అన్ని పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కేటాయించాల్సి ఉందో చర్చించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వంకు అందించారని గుర్తు చేశారు. సీపీఐ చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. గిరిజనులకు అన్యాయం చేయటమే ప్రభుత్వాల లక్ష్యం: సీహెచ్.బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు మాట్లాడుతూ గిరిజనులకు పునరావాసం లేకుండా చేయాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. 138 అడుగుల ఎత్తు నీరు వస్తేనే పోలవరం కాంటూరు ముంపుకు గురైయిందని గుర్తు చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికి నష్టపరిహారం ఇస్తానని జగన్ చేసిన వాగ్దానం ఏమైయిందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు బాగుపడాలి, గిరిజనులు అన్యాయం చేయటమే ప్రభుత్వాల పనిగా ఉందన్నారు. పూర్తిస్థాయి నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవాలి: ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తే టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కేంద్రం 10శాతం నిధులు కూడా ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించటం ద్వారా గతంలో పేర్కొన్న నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండా తప్పించుకుంటున్నారని చెప్పారు. పూర్తిస్థాయిలో పోలవరం నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యాన్సులేసే వారు డ్యామ్‌లు ఎలా కట్టగలరు. మహేష్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ 41 మీటర్ల ఎత్తుకు కుదిస్తే జీవనాడి చచ్చిపోతుందన్నారు. పోలవరం అంచనాలకు పదేపదే కేంద్రం ఎందుకు సవరిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. డ్యాన్సులేసే వారు మంత్రులుగా ఉంటే డ్యామ్‌లు ఎలా నిర్మిస్తారని ఎద్దేవ చేశారు. కేసీఆర్‌కు జగన్ అమ్ముడుపోయాడనే అనుమానం కలుగుతుందన్నారు. ఎత్తు తగ్గిస్తే బ్యారేజీగా కూడా పోలవరం ఉపయోగపడదన్నారు. ఎత్తు తగ్గించే హక్కు ఎవరికీ లేదు: రైతుసంఘం నాయకులు భవానీప్రసాద్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే హక్కు ఎవరికీ లేదని కేవలం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. రాష్ట్రంలో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవటం, వ్యవసాయం అభివృద్ధి, పరిశ్రమల అవసరాలు తీర్చటం కోసం పోలవరాన్ని డిజైన్ చేయటం జరిగిందని వివరించారు. పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం కావటం కోసం అన్ని రాజకీయ పక్షాలు ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ వర్గ సభ్యులు అక్కినేని వనజ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్.కోటేశ్వరరావు, డిప్యూటీ కార్యదర్శి దోనేపూడి శంకర్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, సీపీఐ ఎన్టీఆర్ జిల్లా నాయకులు తూము కృష్ణయ్య, విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా నాయకులు బుడ్డి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బాణావతు పెదబాలు నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఉప్పె నరసింహారావు, తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి షేక్.నాగూల్‌మీరా, గిరిజన సమాఖ్య నాయకులు అంగోతు నాగునాయక్, విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రజానాట్య మండలి విజయవాగ నగర అద్యక్షులు ఎస్‌కె.నజీర్ విప్లవ గేయాలు ఆలపించారు. నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభర్రావు వందన సమర్పణ చేశారు.
Prajavartha Online Telugu News