Breaking News

జగనన్న గృహ నిర్మాణాలు, నాడు`నేడు పనులను గడువులోపు పూర్తి చేయాలి..

-నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న గృహ నిర్మాణాలు, నాడు-నేడు పనులను గడువులోగా పూర్తి చేసి నిర్థేశించిన లక్ష్యాల సాధనపై అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు, నాడు-నేడు పనుల ప్రగతి, స్పందన అర్జీల పరిష్కారంపై స్థానిక కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, మున్సిపల్‌ కమీషనర్లు, యంపిడివోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, తహాశీల్థార్లు,సంబంధిత శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలను జరిపించాలన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు కృషి చేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పేదవానికి పక్కా గృహాం అందించాలన్న లక్ష్యం నేరవేర్చడం మన అందరి కర్తవ్యంగా అధికారులు భావించాలన్నారు. గృహ నిర్మాణాల ప్రగతిలో ఎటువంటి అలసత్వం వహించకూడదన్నారు.స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలో 16,347 గృహ నిర్మాణాలు లక్ష్యంగా నిర్థేశించగా వీటిలో ఇప్పటికే 10వేలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. వివిధ దశలలో ఉన్న 6 వేల గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తుది దశ నిర్మాణంలో ఉన్న గృహాలకు చెందిన లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడి నిర్మాణం పూర్తి చేయడంలో వారికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి సాధ్యమైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. రూప్‌ లెవల్‌ దశలో ఉన్న గృహాలను రూప్‌ కాస్టింగ్‌ దశకు తీసుకురావాలన్నారు. గృహ నిర్మాణాలను పూర్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పడు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. లబ్దిదారులతో ప్రతి రోజు పరస్పరం చర్చించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రూప్‌ లెవల్‌, రూప్‌ కాస్టింగ్‌ దశలో ఉన్న గృహా నిర్మాణాలను పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలోని గృహా నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. నాడు నేడు పథకం కింద చేపట్టిన అదనపు తరగతి గదులు, ప్రహరి గోడలు, మరుగుదొడ్లు, వంట షెడ్లు నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసి నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌,తిరువూరు ఆర్‌డివో వై విప్రసన్నలక్ష్మి, డిఇవో సివి రేణుక, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, హౌసింగ్‌ డిఇ రవికాంత్‌, జిల్లాకు చెందిన మండల స్పెషల్‌ ఆఫీసర్లు యంపిడివోలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *