విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యానికి రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ( కస్టమ్ మిల్లింగ్ రైస్ -సియంఆర్ ) ప్రక్రియను ఈనెల 20వ తేది లోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ రైస్ మిల్లర్లను కోరారు. నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సియంఆర్)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతుల వద్ద నుండి 1లక్ష 39 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందజేయడం జరిగిందన్నారు. అయితే 1లక్ష 34 వేల మెట్రిక్ టన్నులకు సంబంధించి మిల్లర్ల వద్ద నుండి అంగీకార రశీదులను అందజేశారన్నారు. ఇంకనూ 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి అంగీకార రశీదులు రావాల్సి వుందన్నారు. మిల్లర్లకు అందించిన ధాన్యానికి సరిసమాన బియ్యాన్ని అందజేయవలసిన భాధ్యత రైస్ మిల్లర్ల పై ఉందన్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం (కస్టమ్ మిల్లింగ్ రైస్)లో భాగంగా ఇంకనూ 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు అందజేయవలసిన ఉందన్నారు.ఈ ప్రక్రియను ఈనెల 20 లోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వవలసి ఉందని రైస్ మిల్లర్లు త్వరితగతిన బ్యాంకు గ్యారెంటీలు అందిస్తే రానున్న రబీలో ధాన్యం సేకరణ సన్నాహానికి ఆస్కారం ఉంటుందని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు.
సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి. శివరామ మూర్తి, డిఎస్వో పి. కోమలి పద్మ, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, బపర్ గౌడన్స్ మేనేజర్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News