రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా పొగాకు వినియోగం వలన కలిగే ఆరోగ్య సంబంధిత పరిణామాల పై ప్రజలకు అవగాహన ర్యాలీ ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి వై. జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టరు మాధవీలత, జేసీ , మునిసిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టరు కె . మాధవీలత మాట్లాడుతూ సిగరెట్టు, ఇతర పొగాకు సంబందిత ఉత్పత్తులు వినియోగం వలన శారీరక, మానసిక ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వలన ప్రతి సంవత్సరం 80 లక్షల మంది చనిపోతున్నారన్నారు. సిగరెట్ వాడడం వలన అందులోని రసాయనాలు మనిషి యొక్క అవయవాలపై ప్రభావం చూపించి గొంతు క్యాన్సర్ , ఇతర ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నా రన్నారు. బహిరంగ ప్రదేశాలు ధూమపానము చేసిన మరియు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని 100 గజాల లోపు ఎవరైనా దుకాణాలలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం తో పాటు మానవుని ఆయుస్సు క్షీణిస్తుందన్నారు. పొగాకు ఏ రూపంలో వాడినా అది మానవాళి ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుందన్నారు. సిగరెట్ వాడడం వలన అందులో ఉన్న నాలుగు వేల రకాల రసాయనాలు మనిషి యొక్క అవయవాలపై ప్రభావం చూపించి గొంతు క్యాన్సర్ కు కారణం అవుతున్నాయన్నారు. అలాగే జనసమూహముల గల బహిరంగ ప్రదేశాల్లో, దూమపానము నిషేదం ఉందన్నారు.
మునిసిపల్ కమిషనర్ కె. దినేశ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాలలో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడ దన్నారు. నిబంధన లను ఎవరైనా అతిక్రమించినట్లు గుర్తిస్తే వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఎవరైనా దుకాణాలలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు రూ.200 జరిమానా కూడా విధించడం జరుగుతుందని, పొగాకు ఉత్పత్తులపై ఎటువంటి ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన వారందరి చేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ . రమేష్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డా. కె. వెంకటేశ్వర రావు, వైద్య ఆరోగ్య శాఖ ఎన్.సి.డి పి.ఓ డా.రాజీవ్, డా. ఎమ్. రాజకుమారి ఇమ్యూనై-జేషన్ అధికారి, డా.లక్ష్మీ దేవి, డి ఎన్ ఎమ్ ఓ, మరియు ఎమ్.ఎల్.హెచ్.పి లు, ఎఎన్ఎమ్ వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది, డి.సి.ఎమ్.బీ.రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News