-డ్రగ్స్ వినియోగం, సరఫరా చేసే వారి వివరాలు అందించండి
-సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం
-రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నగదు పారితోషికం
-అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తాం
-కలెక్టర్ కె .మాధవీలత
-ఎస్పీ సుధీర్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గంజాయి, మాదక ద్రవ్యాలను సాగు చేస్తున్నా, రవాణా చేస్తున్న వారి వివరాలు తెలియ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నగదు పురస్కారం అందచెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. జిల్లాను మాదక ద్రవ్యాల వినియోగ రహిత జిల్లాగా తీర్చి దిద్దుదామని కలెక్టర్, ఎస్పీ పిలుపునిచ్చారు.
శాఖల సమన్వయంతో పనిచేయడం ద్వారా తప్పకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.
సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత , ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ తో కలిసి జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్ తగ్గింపు (ఎన్‌సీఓఆర్‌డీ) కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ డ్రగ్స్ దుర్వినియోగదారుల సంఖ్యను తగ్గించడానికి జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించడం జరిగిందన్నారు. జిల్లాలో పెరుగుతున్న మాదకద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఎస్పీ తో కలిసి సమన్వయ శాఖలతో కూడి సమావేశం నిర్వహించా మన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు జరిపే వారిపై కేసులు నమోదు చేయడం తో పాటు వారి ఆస్తులను, వారి బంధువుల ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చట్ట విరుద్ధమైన మాదకద్రవ్యాల కార్య కలాపాలను నిరోధించడానికి, తరచుగా దాడులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ప్రజలు సామాజిక బాధ్యత తో కూడి సమాచారం అంద చెయ్యాలని కోరారు. నషా ముక్త్ భారత్ కింద నషా ముక్త్ పంచాయతీ అనే కార్యక్రమం కూడా ప్రారంభించ బడిందన్నారు. డ్రగ్స్ వినియోగ రహిత జిల్లా గా తూర్పుగోదావరి జిల్లాను రూపొందించడం లో శాఖల మధ్య సమన్వయం, తోడ్పాటు ఉండాలని అన్నారు. ఇందులో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాలు పండించడం నుంచి, వినియోగించడం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని గుర్తించి వాటి నియంత్రణ పద్ధతులు సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యం అన్నారు. ఆ దిశలో పంట, రవాణా వ్యవస్థ, ఎవ్వరూ వీటిని అమ్ముతున్నారు, ఎవ్వరూ వినియోగిస్తున్నారు అన్న ప్రతి ఒక్క చిన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని , శాఖల మధ్య సమన్వయం ఉంటే తప్పకుండా జిల్లాలో నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు జిల్లాలోని ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రగ్ డిటెక్షన్ సెంటర్ మరియు అడిషనల్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ రెండూ సమర్ధవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి బానిస అయిన వారి పై నిరంతర నిఘా ఉంటాయనీ, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ బాధ్యతలను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.
రొటీన్ కేసులు తప్ప సమాచారం అందించే కేసులు తక్కువుగా వున్నాయని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను పండింస్తున్న, రవాణా చేస్తున్న వారి వివరాలు తెలియజేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు నగదు పురస్కారం కింద రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అందిస్తా మన్నారు. అవగాహన కార్యక్రమాల సందర్భంగా కళాశాల, హైస్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రవర్తనా మార్పులు, విద్యా మార్పులు, శారీరక మార్పులను గమనించి డ్రగ్స్ బానిసలను గుర్తించి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించాలని గోప్యత పాటించాలని కోరారు.
గంజాయి అమ్మకం మరియు వినియోగం నిరోదిద్దాం: ఎస్పీ సుధీర్ కుమార్
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు, వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నా మన్నారు. పాఠశాలలు, కళాశాలలు, నగర శివారు నివాస ప్రాంతాలు, నదీ తీరాలు, సాధువులు ఉండే ప్రాంతాల్లో, నగరంలో ఇప్పటికే గుర్తించిన పలు ప్రాంతాల ప్రాంగణంలో చిరు వ్యాపారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆమేరకు అటువంటి వ్యక్తులను కనుగొనడానికి పోలీసింగ్ బలోపేతం చేశామన్నారు. జిల్లాలో ఎన్‌డిపిఎస్ చట్టంపై 16 కేసులు నమోదయ్యాయని, ఇందులో 13 కేసులు వాణిజ్యపరంగా, 3 కేసులు వాణిజ్యేతర గా పరిగణించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 53 మంది నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.78,73,835/- విలువ గల 1574.767 కిలోల గంజాయితో పాటు 10 వాహనాలను కూడా స్వాధీనం పరుచు కున్నామన్నారు. 53 మంది నిందితుల్లో 46 మంది నిందితులు ఏపీకి చెందిన వారు కాగా మిగిలిన 7గురుఇతర రాష్ట్రాలకు చెందినవారన్నారు.
ప్రివెంటివ్ నిర్బంధాలు, చర్యలు:
ఇప్పటివరకు 5 మంది పునరావృత్త NDPS నేరస్థులను గుర్తించి, వారిపై PD చట్టం ప్రతిపాదనలు ప్రారంభించడం జరిగిందని వారిలో, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 3 గురు పై పీడీ చట్టం ప్రతిపాదనలు నమోదు ప్రక్రియలో ఉన్నట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు నియంత్రణ పై అవగాహన నిర్వహణకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ & SEB, ర్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 పై అవగాహన కల్పించి, హోర్డింగ్‌లను అన్ని విద్యా సంస్థలు మరియు ఇతర ముఖ్యమైన జంక్షన్‌ల కూడళ్ళ వద్ద విస్తృత ప్రచారం కోసం 1908 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసామన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు దుష్ప్రభావాల గురించి కళాశాల, హైస్కూల్ ల్లోని యువతకు అవగాహన కల్పించేందుకు పోలీసులు మరియు SEB కాలేజ్ & హైస్కూళ్లలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు., రాజమహేంద్రవరం పట్టణంలోని లాడ్జి మేనేజ్‌మెంట్ మరియు లారీ/ఇతర రవాణాదారులకు ఎవరైనా అనుమానాస్పద అపరిచితులు, బ్రోకర్లు మరియు గంజాయి స్మగ్లర్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించామన్నారు. గంజాయి సాగును నియంత్రించడం ఫారెస్ట్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. అగ్రికల్చర్ చెక్ పోస్ట్, RTC & రైల్వే పార్శిల్ సేవలు ద్వారా గంజాయి రవాణాను నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డీటీవో(ట్రాన్స్ పోర్టు) కె.ఎస్.యం.వి కృష్ణారావు, డీఎస్పీ సౌత్ జోన్ కె. శ్రీనివాసరావు,రెడ్ క్రాస్ కోఆర్టినేటర్ వై. ప్రకాష్ రావు, జీ హెచ్ సైకాలజిస్ట్ డా అఖిల, డిఎస్పీ శ్రీలత, డిపో మేనేజరు షేక్ సబ్నమ్, ఇంటిల్ జెన్సీ బ్యూరో యం. మోహన రావు, తాహశీల్థారు, డబ్లూ లక్ష్మీ రమణి, డిపిఆర్వో ఐ. కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News