విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిస్టిక్ట్ ఎలక్షన్ గొడౌన్‌లో భద్రపరచే ఈవీఎం, వివిప్యాట్స్ యంత్రాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించి నిరంతర నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు అధికారులను ఆదేశించారు.గొల్లపూడి మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఈవీఎం, వివిప్యాట్స్‌లను భద్రపరిచేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన డిస్టిక్ట్ ఎలక్షన్ గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు, జాయింట్ కలెక్టర్ డా.పి.సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్‌లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి జిల్లాకు 15వేలు వివిప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు (సియు.యంత్రాలు) నేడు జిల్లాకు చేరుకోనున్నాయన్నారు. 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గొడౌన్‌ను సిసి కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామన్నారు. సిసి కెమెరాలతో నిరంతర నిఘాతో ఉన్న సెక్యూరిటీ గార్డ్ గదిని కూడా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎం, వివిప్యాట్స్ యంత్రాలను నూతన గొడౌన్‌లలో భద్రపరుస్తున్నామన్నారు.ఈవీఎం, వివిప్యాట్స్‌లకు సంబంధించి ప్రతి యంత్రం కోడ్ నెంబరును ఆన్‌లైన్ లో పరిశీలించి గోదాములో భద్రపరచాలని అధికారులను ఆదేశించామన్నారు. గొడౌన్ పరిశరాలలో భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు.డిస్టిక్ట్ ఎలక్షన్ గొడౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఆర్‌ఓ కె. మోహన్ కుమార్, మార్కెట్ యార్డు డైరెక్టర్ ఎం. దివాకర్ బాబు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఇంతియాజ్ పాషా, రూరల్ తహశీల్థార్ జహ్నావి, ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ సిహెచ్. దుర్గాప్రసాద్, డిప్యూటి తహాశీల్థార్ మధు, మార్కెట్ యార్డ్ ఇఇ వై. శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇఇ వి ఎస్ ఆర్ కే ప్రసాద్ ఉన్నారు.
Prajavartha Online Telugu News