విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ సమ్మర్ రివిజన్లో భాగంగా ఎన్నికల కమీషన్ నిబంధనలు పాటిస్తూ నూరు శాతం పునఃపరిశీలన పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి వివరించిన జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి మంగళవారం స్పెషల్ సమ్మర్ రివిజన్ – 2024 లో భాగంగా ఇంటింటి పరిశీలన (హౌస్ టు హౌస్ వెరిఫికేషన్), మరణించిన, నకిలీ ఎంట్రీలపై ఫిర్యాదులు, ఎపిక్స్ జనరేషన్, తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఇంచార్జి డిఆర్ఓ జి. వెంకటేశ్వర్లు , ఈఆర్ఓలు, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నిబంధనలను పాటిస్తూ జిల్లాలో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన అనంతరం పునఃపరిశీలన పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు వివరించారు. జిల్లాలో 06.01.2022 నుంచి 31.08.2023 వరకు జరిగిన 1,59,497 ఓటర్ల తొలగింపులు ఉన్నాయని వీటిలో 56,365 మరణించిన, 57,265 ఫోటో సిమిలర్ ఎంట్రీస్(పీఎస్ఈ), డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్(డీఎస్ఈ) గాను 45,867 షిఫ్టింగ్ ఓటర్లుగాను ఉన్నాయన్నారు. వీటిని పునఃపరిశీలన చేయడం జరిగిందని, ఎటువంటి పిర్యాదులు లేకుండా పునఃపరిశీలన పూర్తి చేశామన్నారు. ఈఆర్ఓలు, ప్రత్యేక అధికారులు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు అన్ని క్లెయిమ్స్ పునఃపరిశీలన చేయడం జరిగిందని, ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా ఈ ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఫిర్యాదులు, క్లెయిమ్స్ లకు సంబంధించి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో పరిశీలన పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంటింటి పరిశీలనలో వచ్చిన ఫాం-6,7,8 క్లెయిమ్స్ లను ఈనెల 15వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా వచ్చిన నూతన ఓటర్ల నమోదుకు సంబంధించి పరిశీలన కార్యక్రమం 15 రోజుల్లోగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో గుర్తించిన సమస్యలను ఎన్నికల కమీషన్ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 18వ తేదీన ఈఆర్ఓలు తమ నియోజకవర్గ పరిధిలో శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులతోను, 19వ తేదీన జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సమావేశంలో స్పెషల్ సమ్మర్ రివిజన్ – 2024కి సంబంధించిన ఫిర్యాదుల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, తదితర వివరాలను తెలియజేస్తామని, 22వ తేదీన తుది జాబితాను ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు.
Prajavartha Online Telugu News