– కార్యక్రమం విజయవంతానికి తమదైన భాగస్వామ్యం అందిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధులు
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈవీఎం, వీవీప్యాట్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ), ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 ప్రక్రియలు సజావుగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ప్రతి వారం నిర్వహించే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని కలెక్టర్ డిల్లీరావు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్.. ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియలో పురోగతి, ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024లో భాగంగా ప్రదర్శించిన ముసాయిదా ఓటర్ల జాబితా, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, ప్రత్యేక ప్రచార తేదీలు తదితరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్ తనిఖీ ప్రక్రియ సజావుగా సాగుతోందని.. ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమదైన భాగస్వామ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్ఎల్సీ చివర్లో లోడ్ టెస్ట్, మాక్‌పోల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024లో భాగంగా గత నెల 27వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శించినందున డిసెంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందన్నారు. డిసెంబర్ 26వ తేదీ నాటికి వీటి పరిష్కారం పూర్తిచేసి.. 2024, జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు వివరించారు. 100 శాతం స్వచ్ఛతతో దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా జిల్లాలో కృషిజరుగుతోందని కలెక్టర్ డిల్లీరావు స్పష్టం చేశారు. సమావేశంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News