-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమ నిర్వహణపై వైద్య ఆరోగ్య సిబ్బందితో బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపుల నిర్వహిస్తున్న తీరుపై సుధీర్ఘంగా చర్చించారు. ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాలలో నిర్వహించిన టెస్టులు, నెట్ వర్క్ ఆస్పత్రుల రెఫరల్స్, కంటి వెలుగు సర్జరీ సిఫారసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీ, జీజీహెచ్, తదితర వాటికి వైద్యులు చేసిన రెఫరల్స్ మీద దృష్టి సారించాలని.. వారందరినీ ఎఎన్ఎంలకు మ్యాప్ చేయాలని అధికారులకు సూచించారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, వారి ఆరోగ్యం బాగు అయ్యేంత వరకూ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలన్నారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందులను సరిపడా అందించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే క్యాంపుల వద్ద వసతుల కల్పనలో ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్షను వీలైనంత ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా చూడాలని మల్లాది విష్ణు అన్నారు. ఆయా సచివాలయాలకు సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా అధిక శాతం ప్రజలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి క్యాంపులోనూ రోగుల సంతృప్తి స్థాయి ఎంతో ముఖ్యమని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నియోజకవర్గంలో దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ సుహాసిని, ఏసీ(ప్రాజెక్ట్స్) సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్(హెల్త్) రత్నావళి, జోనల్ కమిషనర్ మాల్యాద్రి, జేఏఎస్(జగనన్న ఆరోగ్య సురక్ష) ప్రోగ్రాం ఇంఛార్జి ఇందుమతి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ సుమన్, డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News