Breaking News

పుస్త‌క ప‌ఠ‌నంతో విజ్ఞానంతో పాటు ఊహాత్మ‌క‌, సృజ‌నాత్మ‌క శ‌క్తి

– విద్యార్థులు పుస్త‌క ప‌ఠ‌నాన్ని అల‌వాటు చేసుకోవాలి
– 56వ జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్త‌క ప‌ఠ‌నంతో విజ్ఞానంతో పాటు ఊహాత్మ‌క‌, సృజ‌నాత్మ‌క శ‌క్తి సొంత‌మ‌వుతుంద‌ని.. అందువ‌ల్ల విద్యార్థులు పుస్త‌క ప‌ఠ‌నాన్ని అల‌వాటుగా చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.మంగ‌ళ‌వారం కొత్త‌పేట కాక‌ర‌ప‌ర్తి భావ‌నారాయ‌ణ (కేబీఎన్‌) క‌ళాశాల‌లో 56వ జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాల (న‌వంబ‌ర్ 14-20)ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు జ్యోతిప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. విద్యార్థుల‌కు జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వ, బాల‌ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ స‌మాజంలో గ్రంథాల‌యాలు, గ్రంథ‌పాల‌కుల ఔన్న‌త్యాన్ని చాటిచెప్పేందుకు పుస్త‌క ప‌ఠ‌నం అల‌వాటుతో పొందే ప్ర‌యోజ‌నాల‌పై అవ‌గాహ‌న పెంపొందించేందుకు 1968 నుంచి ఏటా న‌వంబ‌ర్ 14-20వ‌ర‌కు జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్నామ‌ని వివ‌రించారు. అదే విధంగా భార‌త‌దేశ గ్రంథాల‌య సైన్స్ పితామ‌హుడు డా. ఎస్‌.ఆర్‌.రంగ‌నాథ‌న్ గుర్తుగా ఆయ‌న పుట్టిన‌రోజు ఆగ‌స్టు 12న జాతీయ లైబ్రేరియ‌న్స్ డేగా జ‌రుపుకుంటున్నామ‌న్నారు. పుస్త‌క ప‌ఠ‌నంతో ఇన్ఫ‌ర్మేష‌న్‌తో పాటు ఇమాజినేష‌న్ నైపుణ్యాలు అల‌వ‌డ‌తాయ‌ని.. త‌ద్వారా మేధో వికాసం జ‌రుగుతుంద‌న్నారు. అక‌డ‌మిక్ పుస్త‌కాల‌తో పాటు గ్రంథాల‌యాల‌ను సంద‌ర్శించి సునిశిత పరిశీల‌న ద్వారా
భిన్న పుస్త‌కాలు చ‌దివి, సారాంశాన్ని ఆక‌ళింపు చేసుకోవ‌డం ద్వారా స‌ర్వ‌తోముఖాభివృద్ధి దిశ‌గా అడుగులేయాల‌ని సూచించారు. ప్ర‌స్తుత ఆధునిక సాంకేతిక ప్ర‌పంచంలో ఈ-బుక్స్‌, ఆడియో బుక్స్ వంటివి అందుబాటులో ఉన్నాయ‌ని.. ఇలాంటివి ఎన్నిఉన్నా పుస్త‌కం విలువ ఎప్పుడూ ఉన్న‌త‌మేన‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల మంచి పుస్త‌కాల‌ను చ‌దువుతూ ఉన్న‌త భ‌విష్య‌త్తును సొంతం చేసుకోవాల‌ని సూచించారు. కేబీఎన్ క‌ళాశాల‌కు ఎప్పుడొచ్చినా తాను చ‌దువుకున్న క‌ళాశాల‌కు వ‌చ్చిన భావ‌న క‌లుగుతుంద‌ని.. ఆరువేల‌మందికి పైగా విద్యార్థులు ఉన్నా ఉత్త‌మ ప్ర‌మాణాల‌తో ఎలాంటి స‌మ‌స్యా లేకుండా క‌ళాశాల‌లో విద్య అందుతోంద‌ని.. ఇందుకు స‌మ‌ర్థ‌వంత‌మైన యాజ‌మాన్యం, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది కృషి కార‌ణ‌మ‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప్ర‌శంసించారు.

క‌దిలే గ్రంథాల‌యం మ‌న క‌లెక్ట‌ర్‌: ప్రిన్సిప‌ల్ నారాయ‌ణ‌రావు
క‌దిలే గ్రంథాల‌యం మ‌న క‌లెక్ట‌ర్ డిల్లీరావుగార‌ని.. ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ప‌థ‌కాల‌ను ల‌బ్ధిదారుల‌కు అందించ‌డంలో ఆయ‌న విశేష కృషిచేస్తున్నార‌ని క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డా. వి.నారాయ‌ణ‌రావు అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్న క‌లెక్ట‌ర్ విజ్ఞాన పిపాసి, పుస్త‌క పిపాసి అని పేర్కొన్నారు. క‌ళాశాల‌లో ప్ర‌త్యేకంగా లైబ్ర‌రీ సైన్స్ డిపార్ట్‌మెంట్ ఉంద‌ని.. భిన్న పుస్త‌కాల‌తో కూడిన అధునాత‌న గ్రంథాల‌యం ఉంద‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మం అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. క‌ళాశాల గ్రంథాల‌యాన్ని ప‌రిశీలించారు. చారిత్ర‌క‌, ఆధ్యాత్మిక‌, సాహిత్యం త‌దిత‌రాల ఔన్న‌త్యాన్ని చాటిచెప్పే గ్రంథాల విభాగాల‌తో పాటు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ త‌దిత‌ర పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విద్యార్థుల‌కు ఉపయోగ‌ప‌డే కాంపిటేటివ్ పుస్త‌కాల విభాగాన్ని కూడా క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ఈ గ్రంథాలయాన్ని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. వారోత్స‌వాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా విద్యార్థుల నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. కార్య‌క్ర‌మంలో క‌ళాశాల సెక్ర‌ట‌రీ, క‌ర‌స్పాండెంట్‌ టి.శ్రీనివాస్‌, కోఆర్డినేట‌ర్ కె.రామ‌కృష్ణ‌, లైబ్ర‌రీ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ వై.శ్రీనివాస రాజు, ఇంట‌ర్మీడియెట్ విభాగం ఇన్‌ఛార్జ్ ప్రిన్సిప‌ల్ టి.భాగ్య‌కుమార్‌, క‌ళాశాల సిబ్బంది, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *