– విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పరిశ్రమల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, ముఖ్యంగా రసాయన పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు డిజస్టర్ మేనేజ్ మెంట్ ఉన్నతాధికారులకు వివరించారు.
రసాయన విపత్తు సంభవిస్తే నష్టాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక అమలును పరీక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ), ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ( ఏపీఎస్డీఎంఏ) నిర్వహించనున్న మాక్‌డ్రిల్ సన్నద్ధతపై ఆయా సంస్థల ఉన్నతాధికారులు బుధవారం 11 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు రసాయన పరిశ్రమల యాజమాన్యాలు తదితరులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమన్వయ సమావేశానికి కలెక్టర్ డిల్లీరావు, పరిశ్రమలు, విపత్తు నిర్వహణ, రెవెన్యూ, వైద్యం, పోలీస్, మునిసిపల్, సమాచార, పౌర సంబంధాలు తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.
మాక్‌డ్రిల్ నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు మార్గనిర్దేశనం చేసిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ డిసెంబర్ 21న మాక్‌డ్రిల్ జరగనుందని, దీనికోసం బుధవారం ఓరియెంటేషన్, సమన్వయ సమావేశం జరిగిందని, డిసెంబర్ 19న టేబుల్‌టాప్ ఎక్సర్సైజ్ జరగనుందని వెల్లడిరచారు. రసాయన విపత్తు జరిగిన స్వల్ప సమయంలోనే భారీ నష్టం జరిగేందుకు అవకాశముంటుందని, అందువల్ల పటిష్టమైన విపత్తు నిర్వహణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న రాష్ట్రస్థాయి మాక్‌డ్రిల్ జరగనుందని, ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలోని ఆర్చ్ లేబొరేటరీలో మాక్‌డ్రిల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఆఫ్‌సైట్, ఆన్సైట్ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదేశించారు.
సమావేశంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్వో . ఎస్. వి. నాగేశ్వరరావు, డియంఅండ్హెచ్వో యం. సుహాసిని, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుధాకర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ శ్రీనివాస్, పంచాయితీరాజ్ ఎస్ఇ కె. వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News