– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టం అమలుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. https://poa.apcfss.in ద్వారా బాధితులు ఎవరైనా ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేయొచ్చని.. ఈ ఫిర్యాదు స్వభావం ఆధారంగా వెంటనే అందులోని సమాచారం సంబంధిత అధికారులకు చేరుతుందన్నారు. ఉదాహరణకు ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్, విచారణకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే అది వెంటనే పోలీసు శాఖకు చేరుతుందన్నారు. అదే విధంగా పరిహారానికి సంబంధించిన సమస్య అయితే రెవెన్యూ శాఖకు వెళ్తుందన్నారు. అధికారులు వారి లాగిన్ల ద్వారా ఫిర్యాదు స్టేటస్‌ను అప్‌డేట్ చేస్తూ పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాత బాధితులకు ఒక సందేశం వస్తుందని.. అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఫిర్యాదు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చని వివరించారు. ఫిర్యాదుల స్టేటస్ నివేదికలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కూడా అవకాశముంటుందని తెలిపారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్ అభివృద్ధి చేసిన ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
Prajavartha Online Telugu News