మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులు తమ హక్కుల గురించి, వాటి పరిరక్షణ చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 24 తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని, శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాలులో ప్రత్యేక కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వినియోగదారులు మేలుకోవాలని, వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలంటూ పిలుపునిచ్చారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం పటిష్టవంతంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. వినియోగదారుల హక్కుల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
నగరంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ” Consumer protection in the era of e-commerce and digital trade” అంశంలో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు తెలుగు ఇంగ్లీషు మాధ్యమాలలో నిర్వహించి, విజేతలకు జాయింట్ కలెక్టర్ ప్రశంసా పత్రాలతో పాటు ప్రథమ బహుమతిగా రూ. 1500/-, ద్వితీయ బహుమతి రూ. 1000/-, తృతీయ బహుమతి రూ. 750/- నగదు బహుమతులను అందజేశారు. తూనికల కొలతల శాఖ సహాయ నియంత్రణ అధికారి టి. రాజేంద్ర ప్రతి వస్తువు ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మ రాదని, తూనికల కొలతలలో మోసాలు వివరిస్తూ, వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1967 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
రవాణా శాఖ అధికారి సాధిక్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థి దశ నుండి అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారుల సంఘాల ప్రతినిధులు సైకం భాస్కరరావు, బాజీ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి వివరించారు. తొలుత డిఎస్ఓ పార్వతి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు గురించి వివరించారు. ఈ సమావేశంలో వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
_________
Prajavartha Online Telugu News