గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించబడిన శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగంకు మే 1 వరకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, జిల్లాలో అదర్ పోలింగ్ ఆఫీసర్స్ (ఓపిఓ)గా ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ను మే 1 వరకు దరఖాస్తు చేసుకునేలా గడువు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ లో ఫారం-12(2 కాపీలు) అందించాలని తెలిపారు. ఫారం-12తో పాటుగా ఓటర్ ఎపిక్ కార్డ్ కాపీ, డ్యూటీ ఆర్డర్ కాపి, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది కార్యాలయ పని వేళల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటారని తెలిపారు.
Prajavartha Online Telugu News