Breaking News

ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత, కర్తవ్యం

-దేశ భవిష్యత్తు యువ ఓటర్ల భుజస్కందాలపై ఉంది
-యువ ఓటర్లు నమోదులో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం
-ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలతో రాష్ట్రంలో 10.3 లక్షలకు పైగా యువ ఓటర్లు నూతనంగా నమోదు
-యువ ఓటర్ల భాగస్వామ్యంతోనే ఎన్నికల పండుగ విజయవంతం అవుతుంది
-గుంటూరులో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ ఓటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు కల్గిన ప్రతి ఓటరు మే 13వ తేదిన జరిగే పోలింగ్ లో తప్పక ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఓటరు అవగాహన కోసం లెట్స్ ఓట్ సంస్థ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతతో నిర్వహించిన 3కె వాక్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ తుషార్ డూడీ, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తీ చేకూరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) పవార్ స్వప్నిల్ జగన్నాధ్, లెట్స్ ఓట్ సంస్థ జాతీయ కన్వినర్ కె సుబ్బరంగయ్య తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది ఒక బాద్యత, కర్తవ్యం, నిబద్ధత అనే విషయం మన అందరికి తెలుసని అన్నారు. ఓటు హక్కు వినియోగించటం దేశం పట్ల మన విధి అన్నారు. ప్రభుత్వ పరిపాలనను మార్చేశక్తి ఓటుకు ఉందన్నారు. దేశ భవిష్యత్తుపట్ల బాధ్యత మరియు ప్రజాస్వామ్యం పట్ల కర్తవ్యం యువతరం భుజస్కందాలపై ఉందన్నారు. ఈ రోజు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన యువత ఈ దేశానికి రాష్ట్రానికి ఆశాకిరణం అన్నారు. యువత మీద మాకు ఉన్న నమ్మకం వారు యువకులై ఉండటమే కాదని ఈ దేశ భవిష్యత్తు వారి భుజస్కందాలపై ఆదారపడి ఉందన్నారు. ప్రజల అబిష్టంమేరకే దేశ,రాష్ట్ర పాలనా ఏర్పాటు నిర్ణయించబడుతుందని తెలిపారు. మీ అభిప్రాయాన్ని వ్యక్తపర్చటానికి మరియు మీ ఎంపికను వ్యక్తికరించటానికి మీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇదే అన్నారు. దేశ పౌరులుగా యువతకు క్రోత్త దృష్టి కోణం ఉంటుందని, దేశ భవిష్యత్తు వారి భుజస్కందాలపై ఆదారపడి ఉంటుందని అందువలన ఎన్నికల సంఘం ఎల్లప్పుడు యువతరాన్ని అన్ని విధాల ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల పండుగలో యువత క్రోత్త ఉత్సాహాంతో ఓటును వినియోగించుకోవటం ద్వారా దేశానికి మేలు చేసే నిర్ణయాన్ని చేపడతారని ఎన్నికల సంఘం ప్రతినిధులుగా మేము కూడ భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తును పండుగలాగ తీసుకోవటం జరిగిందని, ఈ పర్వాన్ని ఎన్నికల కమిషన్ “చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్” అన్నారన్నారు. ఈ ఎన్నికల పండుగలో యువకుల బాగస్వామ్యం లేకుండా పూర్తి కాదన్నారు. గత ఏడాది అక్టోబరు మాసంలో డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. అందులో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువ ఓటర్లు 2.5 లక్షలు మాత్రమే కలిగి ఉండటం నిరుత్సాహకరంగా ఉండేది. ఎన్నికల కమిషన్, జిల్లా యంత్రాంగాలతో, సేవా సంస్థలతో యువ ఓటర్లు నమోదు ప్రక్రియను ప్రత్యేక దృష్టితో చేపట్టడం వలన రాష్ట్రంలో 10.3 లక్షలకు పైగా యువ ఓటర్లను నూతనంగా నమోదు చేయటం జరిగిందన్నారు. యువ ఓటర్ల నమోదుకు శ్రద్ధ తీసుకున్న గుంటూరు జిల్లా యంత్రాగాన్ని అబినందిస్తున్నామన్నారు. వీరందరు పోలింగ్ రోజు ఓటు వినియోగించుకోనేలా చేయటం పెద్ద సవాలు అన్నారు. నూతనంగా ఓటు హక్కు పొందిన యువతతో పాటు ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు విలువను గుర్తించి తమ ఓటు హక్కును సద్వినియోగ పర్చాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో యువతతో పాటు ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించటంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల పరిధిలోని దాదాపు 20 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం దేశంలో నమోదైన సగటు ఓటింగ్ శాతం 68 శాతం కంటే తక్కువుగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా వుందన్నారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న లెట్స్ ఓట్ సంస్థ కృషిని అబినందించారు.
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మే 13వ తేదిన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బాగస్వామ్యులు కావాలన్నారు. దేశవ్యాప్తంగా మే 13వ తేదిన లోక్ సభకు, రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ప్రపంచలోని 60 దేశాల్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నయన్నారు. కోట్లమంది ఓటర్లు ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలపై ప్రపంచం దృష్టి ఉందన్నారు. దేశంలో గత కొన్ని దశబ్ధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నదన్నారు. భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించిందని, గతంలో కొన్ని ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై కొంత అవగాహనే లోపం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాల వలన అవగాహన పెరిగిందని, కానీ యువత ఇప్పటికీ ఓటు హక్కు నమోదులోకాని, వినియోగంలో కానీ కొంత నిర్లిప్తత ఉందన్నారు. ఈ రెండు సవాళ్ళును అధిగమించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారి జారీ చేసిన సూచనల మేరకు జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించటాన్ని జిల్లా యంత్రాంగం చాలెంజ్ గా తీసుకొవటం జరిగిందన్నారు. విద్యాసంస్థల యాజమాన్యలను భాగస్వాములను చేసి ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాలు వయస్సు ఉన్న యువతి, యువకులు 43,500 మందిని ఓటర్లుగా నమోదు చేయటం జరిగిందన్నారు. వీరందరు ఓటు హక్కు వినియోగించుకోవటంతో పాటు మీ బాధ్యతగా కుటుంబసభ్యులను, స్నేహితులను ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చోవాలన్న కొద్ది పాటి నిర్లప్తత వలన ఓటు వినియోగంలో ఆసక్తి చూపటం లేదన్నారు. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18 సంవత్సరాల వయస్సు ఉన్న యువ ఓటర్లు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించటంలో బాధ్యత తీసుకోవాలన్నారు. యువ ఓటర్లు నమోదు, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవటం సవాళ్ళును అధిగమించటం ద్వారానే భారత రాజ్యాంగం 61 సవరణ ద్వారా ఓటు హక్కుకు అర్హత 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. జిల్లాలో మొట్ట మొదటి సారిగా ఓటు హక్కు పొందిన వారితొ పాటు, ఓటర్లు అందరూ మే 13వ తేదిన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినయోగించుకోవాలని ఆశిస్తున్నామన్నారు.
సభ అనంతరం యువతతో ఓటరు ప్రతిజ్ఞ చేయించి, రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ తుషార్ డూడీ, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తీ చేకూరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) పవార్ స్వప్నిల్ జగన్నాధ్, లెట్స్ ఓట్ సంస్థ జాతీయ కన్వినర్ కె సుబ్బరంగయ్య తో కలసి ఎన్టీఆర్ సేడియం వద్ద మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతతో నిర్వహించిన 3కె వాక్ ను జెండా ఊపి ప్రారంభించారు. వాక్ లో పాల్గోన్న యువత ఓటు హక్కు ప్రాధాన్యత, అవశ్యకతను వివరించే ప్లే కార్డులతో, నినాదాలతో ఓటర్లుకు అవగాహన కల్పించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన 3కె వాక్ లక్ష్మీపురం, మధర్ థెరిస్సా విగ్రహం సెంటరు, కొరిటెపాడు, వెల్కమ్ హోటల్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మీ, గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీకర్, లెట్స్ ఓట్ గుంటూరు చాప్టర్ కన్వినర్ ప్రో.కె మాలకొండయ్య, కో ఆర్డినేటర్ టి బాలజి శ్రీనివాస్, విద్యాసంస్థల యాజమాన్యాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున నూతనంగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *