– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎన్ని కూటములు ఏకమైనా.. జన సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తోన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 62వ డివిజన్ లో గురువారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. తమ ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్యేను ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. హారతులతో బ్రహ్మరథం పట్టారు. ప్రజా సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు మల్లాది విష్ణు తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతీఒక్కరికీ ఈ ప్రభుత్వంలో సంక్షేమ ప్రయోజనాలు చేకూరాయన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దోచుకోవడం, పేదల సొమ్ము తినేయడమే పనిగా పెట్టుకుని పాలన సాగించారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేశారన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు
తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి శూన్యమని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, గుణదల ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రూ. 84.73 కోట్లతో వాంబేకాలనీలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో కాపు కళ్యాణ మండపాన్ని కేవలం జీవోలకే పరిమితం చేశారని విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో వంగవీటి మోహన రంగా పేరిట ఎల్బీఎస్ నగర్లో రూ. 1.25 కోట్లతో కళ్యాణ మండపాన్ని సకల హంగులతో నిర్మించుకున్నట్లు చెప్పారు. రూ. 80 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో అనేక రోడ్లకు మోక్షం లభించిందన్నారు. రూ. కోటిన్నర నిధులతో కాలువలను పునరుద్ధరించడంతో పాటుగా రూ. 15 లక్షలతో బాలరాజు పార్కు, ప్రకాష్ నగర్ పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలియజేశారు.
నిరుపేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం
నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మల్లాది విష్ణు అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఈ ప్రభుత్వం సొంతింటి స్థలం మంజూరు చేసినట్లు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో విజయవాడ నగరంలో 28వేల ఇళ్లను మంజూరు చేయగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి లక్ష ఇళ్లను మంజూరు చేశారని చెప్పుకొచ్చారు. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 30వేల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా రూ. 270 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. తెలుగుదేశం హయాంలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పేదల కోసం ఇంత పెద్దమొత్తంలో నిధులను కేటాయించలేదని గుర్తుచేశారు. కనుక చంద్రబాబు చేతగాని పాలనకు, జగనన్న సమర్థ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని గమనించి.. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి నిండుమనస్సుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
టీడీపీ మేనిఫెస్టో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
చంద్రబాబు మాయ మేనిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మల్లాది విష్ణు అన్నారు. గతంలో 650 కి పైగా వాగ్దానాలిచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే.. మేనిఫెస్టోలో 99.4 శాతం హామీల్ని నెరవేర్చిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. 2014 మేనిఫెస్టోలో పేర్కొన్న తొలి ఐదు సంతకాలనే బాబు గాలికొదిలేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతు రుణమాఫీ, రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్, పింఛన్ల పెంపు, మద్యం బెల్టు షాపుల రద్దు, ఉద్యోగుల పదవీ విరమన వయస్సు పెంపు.. ఇలా గతంలో తానిచ్చిన వాగ్ధానాలను బాబు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అటువంటిది ఇవాళ అలవికాని హామీలిస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని మల్లాది విష్ణు అన్నారు. చివరకు దిక్కుతోచక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను, పక్క రాష్ట్రాల పథకాలను కాపీ కొట్టే స్థాయికి బాబు దిగజారారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుట్ర, మోసపూరిత రాజకీయాలను మరోసారి గట్టిగా తిప్పికొట్టాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు అలంపూర్ విజయ్, వీరబాబు, రామిరెడ్డి, పసుపులేటి యేసు, అఫ్రోజ్, బోరా బుజ్జి, యక్కల మారుతి, మహేష్, భవానీ, ఖాదర్ బి, హైమావతి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News