-రాష్ట్ర పునఃనిర్మాణమే లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టో
-మైలవరం తేదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్
-రెడ్డిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం
రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అన్ని వర్గాల వారి ఆర్థిక అభివృద్ధికి ఉమ్మడి కూటమి మేనిఫెస్టో నిలుస్తోందని మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని సాయన్నపాలెం గ్రామంలో ఆయన గురువారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపీ తో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), విజయబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
తెదేపా కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో ఉన్నట్లుగా తెలిపారు. పేదల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమానికి మేనిఫెస్టో తెలిపిన పథకాలు అండగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో అనే ఉద్దేశంతో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని వివరించారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రజా వ్యతిరేక పాలనతో పలు వ్యవస్థలు నిర్వీర్యమైనట్లుగా ఆరోపించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి సంక్షేమ పాలన కోసం స్పష్టమైన విధివిధానాలతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ జాతీయ నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రతినిధులు ఆలోచనలకు అనుకూలంగా మేనిఫెస్టోను రూపొందించారన్నారు. గత సంవత్సర కాలం నుండి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్ళాయన్నారు. ఆ పథకాలు వల్ల యువతకు, మహిళలకు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు, చదువుకునే పిల్లలకు రూ.15,000లు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, పథకాల హామీలను ప్రజలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, జనసేన, టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News