-వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే వైద్య ధృవీకరణ పథకాన్ని(Medical Certification of Cause of Death-MCCD Scheme), జనన మరణాల్ని నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ విధానం(CRS)తో అనుసంధానం చేయడమే కాకుండా ప్రామాణీకరిం చాల్సిన(Standardize) అవసరం కూడా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే మార్గదర్శకాల్ని జారీ చేశారన్నారు. మెడికల్ కాలేజీల ఆసుపత్రులు, జిల్లా మరియు స్పెషలైజ్డ్ ఆసుపత్రుల్లో ఇప్పటికే ఎంసిసిడి స్కీం అమలవుతోందని, ఇప్పు డు సిఆర్ఎస్ పోర్టల్ కు అనుసంధానం చేశారని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకనుగుణంగా మరణాలకు సంబంధించి కచ్చితమైన కారణాన్ని నమోదు చేసేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న తీరును కూడా పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ ఆరో ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో ఐసిఎంఆర్, ఎన్సిడిఐఆర్(ICMR-NATIONAL CENTER FOR DISEASE INFORMATICS AND RESEARCH) వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే మెడికల్ సర్టిఫికేషన్ ను బలోపేతం చేసేందుకు(Meeting of the stakeholders of the project ‘Strengthening the Medical Certification of Cause of Death-MCCD practices in the public and private Healthcare facilities’ in AP) గురువారం మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023లో సవరించిన జనన మరణాల నమోదు చట్టం ప్రకారం అప్డేటెడ్ సిఆర్ఎస్ పోర్టల్ ద్వారా జనన ధృవీకరణ పత్రాల్ని పొందాల్సి ఉంటుందని, మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే మెడికల్ సర్టిఫికేషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మెడికల్ ఆఫీసర్ లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిరంతరం శిక్షణ ఇవ్వడం ద్వారానే మెరుగైన ఫలితాల్ని సాధించగలమన్నారు. మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే ధృవీకరణ విషయంలో క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సవరించిన సిఆర్ఎస్ పోర్టల్ చాలా బాగుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఎంసిసిడికి సంబంధించి సిఆర్ఎస్ పోర్టల్ కు వైద్య ఆరోగ్య శాఖ సాంకేతికతను అనుసంధానం చేస్తామన్నారు. సుశిక్షితులైన బియస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారని, వారి సేవల్ని వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లకు కూడా ఎంసిసిడిపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎంసిసిడికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి, లోటుపాట్లు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఐసిఎంఆర్, ఎన్సిడిఐఆర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఆర్.సుకన్య(బెంగుళూరు) వివరించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, త్రిపుర, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎంసిసిడి పై అవగాహన కల్పిస్తున్నామని, ఏపీలో చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థల్లో ఆమలు తీరును తమ సిబ్బంది పరిశీలించారని ఆమె తెలిపారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో జరిగే మరణాలన్నీ సిఆర్ఎస్ పోర్టల్లో నమోదవుతున్నప్పటికీ మరణాలకు గల కారణాలు మాత్రం 22 శాతమే నమోదయ్యాయన్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు తాము నివేదికను అందజేశామన్నారు. మరణాలకు గల కారణాల డేటాను క్రోడీకరించడం ద్వారా భవిష్యత్తులో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే వీలుకలుగుతుందన్నారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.పద్మావతి, డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ కె.రవీంద్రరెడ్డి, సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జగనీత్ మజ్హి, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థ లకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News