-ఈ నెల 4వ తేదీ లోపు తప్పకుండా సమర్పించాలి : జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుచేసిన మొత్తాలకు తుది అకౌంట్స్ వివరాలను వ్యయ పరిశీలకులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై తిరుపతి పార్లమెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ప్రదీప్ కుమార్, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మీను ఓలా, తిరుపతి చంద్రగిరి, శ్రీకాళహస్తి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎక్స్పెండించర్ అబ్జర్వర్లతో కలసి జిల్లా కలెక్టర్ వివిధ పార్టీల అభ్యర్థులు మరియు ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను జులై 4వ తేదీలోగా తప్పకుండా సమర్పించాలని తెలిపారు. ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ప్రతి అభ్యర్థి తమ వ్యయ వివరాల బిల్లులను అప్పగించాలన్నారు. పరిమితికి మించి ఖర్చు చేసినా, లెక్కలను సరైన సమయంలో చూపకున్నా ఆ అభ్యర్థులపై అనర్హత వేటు పడటంతోపాటు తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ నామినేషన్ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల తేదీ వరకు ఖర్చు చేసిన వివరాలకు సంబంధించిన నివేదిక, ఎక్స్పెండిచర్ వివరాల బిల్లులు, ఓచర్లు, అఫిడవిట్స్, బ్యాంకు పుస్తకాలు, ఎబిసి రిజిస్టర్లు ఖచ్చితంగా సరిచూసుకొని అభ్యర్థి సంతకంతో జులై 4 వ తేదీలోగా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం 156 మంది అభ్యర్థులు కలరని తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా జిల్లా కేంద్రంలోని ఉంటారని వీలైనంత త్వరలో ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఓచర్లు సూచించిన ప్రొఫార్మాలో పొందుపరిచి ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు, అన్ని నియోజకవర్గాల సహాయ వ్యయ పరిశీలన అధికారులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News