– అడవి ఆవులను గోశాలకు తరలించేందుకు ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చందర్లపాడు మండలం సమీపంలోని కృష్ణానది తీరప్రాంతంలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అడవి ఆవులను బంధించి, ప్రత్యేక గోశాలకు తరలించి అన్నదాతలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
చందర్లపాడు మండలం, వెలది గ్రామ సమీపంలో అడవి ఆవుల వల్ల దెబ్బతిన్న పంటలను బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. స్థానిక అధికారులతో కలిసి డ్రోన్ కెమెరాల సాయంతో అడవి ఆవుల సంచార ప్రాంతాలను, పంట పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా నది తీరప్రాంతంలోని లంక గ్రామాల్లోని అడవుల్లో అడవి ఆవులు సంచరిస్తూ రాత్రి సమయాల్లో సమీప ప్రాంతాల్లో రైతుల పంట పొలాలను, పండిన పంటను ధ్వంసం చేయడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోందన్నారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, స్థానిక అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వెంటనే డ్రోన్ కెమెరాలను ఏర్పాటుచేసి అడవి ఆవులు సంచరిస్తున్న ప్రదేశాలు, ఆవుల మందల జాడలను చిత్రీకరించి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ క్రమంలో అధికారులు అడవి ఆవుల సంచారంపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారని, వాటిని పరిశీలించి అడవి ఆవుల నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. అడవి ఆవులను నిపుణుల సహకారంతో పట్టి బంధించి వాటికోసం ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేసి, తరలించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియను త్వరలో కార్యరూపంలోకి తీసుకొచ్చి అన్నదాతల పంట పొలాలను సంరక్షించే బాధ్యతను తీసుకుంటామని ఆయన తెలిపారు.
క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, డీఎఫ్‌వో జి.సతీష్, చందర్లపాడు తహసీల్దార్ పాల్, ఎన్ఎస్‌పీ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు ఛైర్మన్ కోట వీరబాబు, రైతు సంఘాల ప్రతినిధి రావూరి రమేష్, ఉన్నం నరసింహారావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News