Breaking News

ఇరిగేషన్ ఈఈ గంగ‌య్య‌పై స‌రెండ‌ర్ వేటు!

– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో నిర్ల‌క్ష్యానికి చ‌ర్య‌లు
– విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌న ప‌నుల్లో బాధ్య‌తా రాహిత్యాన్ని స‌హించేది లేదు
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టీక‌ర‌ణ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లా ఇరిగేషన్ ఈఈ (స్పెషల్ డివిజన్) గంగ‌య్య‌ను ప్ర‌భుత్వానికి స‌రెండర్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన‌, విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన ప‌నుల పురోగ‌తిలో నిర్ల‌క్ష్యాన్ని, జాప్యాన్ని స‌హించేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలో ముఖ్యంగా నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యంతో అమలు చేయడం జ‌రుగుతోంద‌ని.. అయితే ఈఈ గంగయ్య ప్రభుత్వ పథకాల అమల్లో క్రమశిక్షణా లోపం, నిర్లక్ష్య ప్రవర్తన ప్రదర్శించినట్లు గుర్తించామ‌న్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాలకు సంబంధించిన నీటి భద్రత, నీటి బడ్జెటింగ్ ప్రాముఖ్యతను సరిగా గ్రహించకపోవడం, స‌బ్ బేసిన్ మ్యాపింగ్ కింద గ్రామస్థాయి కార్యాచరణ ప్రణాళికల తయారీలో తగిన శ్రద్ధ, నిబద్ధత చూపడంలో ఈఈ విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్ర‌తిష్టాత్మ‌క జలధార కార్యక్రమం కింద ఫలితాల ఆధారిత చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి కిందిస్థాయి సిబ్బందికి, స‌మ‌న్వ‌య శాఖ‌లకు అవసరమైన మార్గనిర్దేశం చేయకుండా, జిల్లాస్థాయి సమీక్ష సమావేశాల్లో ఈ కార్యక్రమం జిల్లాకు అవసరం లేదని పలుమార్లు వ్యాఖ్యానించడం క్ర‌మ శిక్ష‌ణారాహిత్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఈ విధమైన ప్రవర్తన జిల్లా పరిపాలనకు అసౌకర్యం కలిగించడమే కాకుండా, సమగ్ర జిల్లా నీటి సంరక్షణ వ్యూహ లక్ష్యాలను దెబ్బతీసే విధంగా ఉందని తెలిపారు. ఈ అంశాల దృష్ట్యా, ఈఈ గంగ‌య్య‌ను ప్రస్తుత హోదా నుంచి స‌రెండర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యం లేదా బాధ్యతా రాహిత్యం ఏ విధంగానూ సహించబోమ‌ని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతతో పనిచేసి, జిల్లా అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయాలని కలెక్టర్ ల‌క్ష్మీశ‌ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *