Breaking News

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ పనుల్లో వేగం పెంచండి

-2026–27 లక్ష్యాలు రెండు నెలల్లో పూర్తి కావాలి
-గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలో ద్వితీయ స్థానం సాధించాం
-ఈ ఏడాది మరింత బాధ్యతగా మడ అడవుల పెంపకం చేపట్టాలి
-తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజా భాగస్వామ్యం పెరగాలి
-రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక
-వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు మరో 70 లక్షల మొక్కలు
-గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో పురోగతిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం మరింత పెరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతల అనుగుణంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనలో భాగంగా గడచిన రెండేళ్ల కాలంలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన అంశాన్ని గుర్తు చేశారు. మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించేందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
సోమవారం మధ్యాహ్నం గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డివిజన్లవారీగా నిర్దేశించిన లక్ష్యాలు ఎంత వరకు పూర్తి చేశారు? ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఈ ఏడాది మడ అడవులు ఎంత విస్తీర్ణంలో నాటనున్నారు? తదితర వివరాలను అంశాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఇవి గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు అదనపు బలం కానున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న తీర ప్రాంత జిల్లాలకు విపత్తుల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి మన తీరాన్ని రక్షించుకోవడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించనుంది. అందుకే కూటమి ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్‌ను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న 1,053 కి.మీ. తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన గోడను ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. మొదటి అర్ధభాగంలో వాతావరణ అనుకూలతల ఆధారంగా కొంత మేర మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. ద్వితీయార్థంలో తాటి విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటి సేకరణ, నాటే ప్రక్రియను పూర్తి చేయాలి. దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటును ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయి. తాటివనాలు, సామాజికవనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.
మడ అడవుల విస్తరణలో పురోగతి
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడచిన రెండేళ్లలో మడ అడవుల పెంపకంలో చక్కటి పురోగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 740 హెక్టార్లు, 2025-26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల విస్తరణ చేపట్టాం. తద్వారా మడ ఫారెస్టింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాం.ఈ అద్భుత ఘనత సాధనకు కృషి చేసిన సిబ్బందికి, సహాయ సహకారాలు అందించిన పర్యావరణ నిపుణులకు హృదయపూర్వక అభినందనలు. సాధారణంగా మడ అడవుల స్థాపనకు అక్టోబర్ నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఏడాది మరింత బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో మిష్టి–II (MISHTI-II) కింద 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. తీర ప్రాంత రక్షణ కవచం అయిన మడ అడవుల ప్రాధాన్యతను గ్రహించి, నిర్ణీత సమయంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేయాలి.
జిల్లాలవారీగా నిర్దేశిత లక్ష్యాలు
గ్రేట్ గ్రీన్ వాల్ కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది 48 హెక్టార్లలో పరిహార అటవీకరణ చేపట్టాం. ఇది చాలా వరకు పూర్తి కావచ్చింది. అత్యధికంగా 5 వేల హెక్టార్లలో తాటి వనాలు నాటుతున్నాం. గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద మరో 1,993 హెక్టార్లను దేశీయ మొక్కలతో నింపేయనున్నాం. 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు లక్ష్యాలుగా నిర్దేశించాం. వీటిలో మడ అడవులు, తాటి వనాలు మినహా మిగిలిన అటవీకరణ అంచెల వారీగా చేపట్టాలి. తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు, క్షీణించిన భూభాగాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీబీ జీ రాం జీ ద్వారా తీర ప్రాంతం వెంబడి నాటేందుకు వీలుగా మరో 70 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నాం. సుమారు 2,500 హెక్టార్లలో ఈ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అందులో ఒక్క రాజమహేంద్రవరం సర్కిల్‌లోనే 3,243 హెక్టార్లలో కలప ఉత్పత్తి, దేశీయ మొక్కలు నాటనున్నాం. గుంటూరు సర్కిల్‌లో 1,832 హెక్టార్లు, విశాఖ సర్కిల్‌లో 1,764 హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.
గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం కింద 5 కిలోమీటర్ల వెడల్పుతో తీరానికి మూడంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. అందులో మొదటి రక్షణ వలయంలో తీరపు అంచుల్లో మడ అడవుల పునరుద్ధరణ, షెల్టర్ బెల్ట్‌ల మొక్కల పెంపకం, రెండు, మూడు వలయాలను కమ్యూనిటీ బఫర్ జోన్లుగా గుర్తించి గ్రామ వనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాల పెంపకాన్ని ప్రజలు, వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నాం. స్థానిక పర్యావరణ పరిస్థితులు, వర్షపాతం, భౌగోళిక స్వభావాలను పరిగణనలోకి తీసుకుని వీటి అమలు చేపట్టాలి. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. ప్రాజెక్టు పురోగతిపై నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ఏపీ గ్రీనింగ్ అండ్ క్లైమెట్ ఛేంజ్ మిటిగేషన్ సొసైటీ ద్వారా గ్రీన్ వాల్ లక్ష్య సాధన దిశగా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామ”న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సానుకూల ముందడుగు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి అమరావతి జర్నలిస్టుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *