రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం-2016 పటిష్ట అమలుకు రెవెన్యూ, పోలీస్, విభిన్న ప్రతిభావంతులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ఐసీడీఎస్ తదితర సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. K. మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టర్ గారి ఛాంబర్ నందు విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం-2016, చట్టం పటిష్ట అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నియమావళి అమలుపై సమన్వయ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం-2016లోని సెక్షన్ 72 మేరకు విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి జిల్లా కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో జిల్లా ఎస్‌పీ, ఆసుపత్రి సేవల సమన్వయకర్త, డీఆర్‌డీఏ పీడీ, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, ఎల్‌డీఎం, మెప్మా పీడీ, ఐసీడీఎస్ పీడీ తదితరులతో పాటు విభిన్న ప్రతిభావంతుల సామాజిక స్థితిగతులు, అభివృద్ధిపై అపార అనుభవమున్న వారిని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కూడా కమిటీలో సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీ ఆర్నెల్లకోసారి సమావేశమై చట్టం అమలు పురోగతిపై సమీక్షించనున్నట్లు వెల్లడించారు. విభిన్న ప్రతిభావంతులపై వివక్ష ఏ రూపంలో ఉన్నా తొలగించాల్సిందేనని. విభిన్న ప్రతిభావంతుల అర్జీల పరిష్కారానికి ప్రతి శాఖ నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులకు విద్య, వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. విభిన్న ప్రతిభవంతుల్లో నైపుణ్యాలు పెంపొందించి. వారు ఉపాధి అవకాశాలు పొందేలా చూడాలన్నారు. క్రీడల దిశగా కూడా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. కార్యాలయాల్లో విభిన్న ప్రతిభావంతులు పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. పాఠశాలల్లో భవిత కేంద్రాలను పటిష్టం చేసేందుకు కృషిచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విభిన్న ప్రతిభావంతులకు అందుబాటులో ఉన్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన పెంపొందించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ మాధవీ లత సూచించారు. సమావేశంలో వి. కామరాజు, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ పీడీ, ఐసీడీఎస్ పీడీ, డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్, అడిషనల్ ఎస్.పి, డి.ఇ.ఓ, వికాస మేనేజర్, ఎల్.డి.ఎం గారు మరియు స్వచ్చంద సేవ సంస్థల నుండి జియాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధి, హృదయాలయ, నిడదవోలు ప్రతినిది, భారతి వికలాంగుల సేవ సమితి, దేవరపల్లి ప్రతినిధి తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News