-హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఇతర నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. వేడుకలలో భారీగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 1980లో జనసంఘ్ నుంచి చాలా ఒడిదుడుకులను తట్టుకుని భారతీయ జనతా పార్టీ నిలబడిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. రెండు సీట్ల నుంచి ప్రారంభమై మూడు వందలకుపైగా సీట్లు కమలం పార్టీకి రావడం చాలా గొప్ప విశేషమని సుజనా చౌదరి అభివర్ణించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక గత 10 సంవత్సరాల మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఆయన పాలన వల్ల నేడు భారత దేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. రానున్న రోజుల్లో దేశ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు.
భారతీయ జనతా పార్టీ వాజ్ పాయ్, అద్వానీ లాంటి నేతల నుంచి నేడు నరేంద్రమోదీ, అమిత్ షా లాంటి సమర్థవంతమైన నాయకులను కలిగి ఉందన్నారు. నేడు దేశ వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరగటం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారని తెలిపారు. 45 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని స్వప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తూ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు.
కార్యక్రమంలో ఏపీ బీజేపీ మీడియా కోఆర్డినేటర్ పాతూరి నాగభూషణం, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు గుడిసె దేవానంద్, జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రాజు, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయంలో….
తాడిగడప లోని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుక జరిగింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ కేంద్రమంత్రి వర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Prajavartha Online Telugu News