-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ తెలుగు జాతి వెలుగు అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తరవాతే బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో టీడీపీని అన్న ఎన్టీఆర్ స్థాపించారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సినిమావాళ్లకు రాజకీయాలేమి తెలుసని హేళన చేసిన చెంప చెళ్లుమనేలా చరిత్ర చూడని విజయంతో సమాధానమిచ్చారన్నారు. తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా అన్న ఎన్టీఆర్ ఎన్నికై నవ శఖానికి నాంది పలికారని మంత్రి సవిత కొనియాడారు. అన్న ఎన్టీఆర్… సినిమాల్లో రాముడు, కృష్ణుడు అయితే.. రాజకీయాల్లో జగదేక వీరుడని, తన రాకతో రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో.. కిలో రెండు రూపాయలకే బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు సొంతిళ్లు వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను చేశారన్నారు. రాజకీయాల్లో పెత్తందారీతనం పోవాలని భావించిన ఎన్టీఆర్.. తన పార్టీలో బడుగులకు పెద్దపీట వేశారని, యువకులను పిలిచి.. టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ దెబ్బతో మహామహులు సైతం రాజకీయ సన్యాసం తీసుకోవాల్సివచ్చిందన్నారు. ఇప్పుడున్న నేతల్లో చాలా మంది ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చినవారేనని తెలిపారు. నీతి, నిజాయితీ, నిర్భీతికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజలు తనకెంతో ఇచ్చారని, తాను కూడా ప్రజలకు ఏదో చేయాలనే అనుక్షణం పరితపించే వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, దేవుడి మాన్యాలకు పన్నులు రద్దు, బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు, సంపూర్ణ మద్యనిషేధం.. ఇలా ఒకటేమిటి ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలన్నీ చరిత్రలో సువర్ణధ్యాయాన్ని లిఖించాయని మంత్రి సవిత వెల్లడించారు.ప్రతి ఒక్కరూ చదువు కోవాలని తపించిన ఎన్టీఆర్.. తన పాలనా కాలంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయం, తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఎన్టీఆర్ హయాంలోనే ప్రాణం పోసుకున్నాయి. ఊరూరా ఆస్పత్రులు.. ప్రతిపేదవాడికి శాశ్వత నివాసం.. రైతుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు… ఇలా ఓ సంక్షేమ రాజ్యాన్నే స్థాపించారు ఎన్టీఆర్. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం అన్న ఎన్టీఆర్ ది… ఏదైతే చెప్పేవారో అదే చేసి చూపించేవారు. తప్పుడు వాగ్దానాలు.. తప్పించుకునే ధోరణి ఎన్టీఆర్ చరిత్రలో కనిపించవు. అందుకే ఆయన యుగ పురుషుడిగా.. ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి సవిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News