Breaking News

యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలి… : శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్

-ఘంటసాలలోని బౌద్ధ స్తూపం వద్ద ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహణ
-కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, అధికారులు, ప్రజలు..
-ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు నిర్వహించిన యోగా శిక్షకులు

ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రోజు యోగా సాధన చేసి శారీరక, మానసిక ఆరోగ్యం పొందాలని అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవమును రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర-2025 కార్యక్రమములు ఒక నెల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఘంటసాల మండలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్తూపం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు ఇతర అధికారులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలతోపాటు సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ప్రత్యేక వేదిక నుండి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి ఆసనాలు వేసే విధానాన్ని చూపుతూ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం వారి చేత యోగాసనాలు వేయించి యోగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు ఆసనాలు వేసేందుకు వీలుగా బౌద్ధ స్తూపం వద్ద పచ్చని తివాచీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసి వారికి అల్పాహారం, తాగునీరు అందించారు.

కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగి పవిత్రమైన బౌద్దారామంలో యోగా కార్యక్రమం నిర్వహించడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం అన్నారు. అంత విశిష్టత కలిగిన యోగ గొప్పతనాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం బౌద్ధ ధర్మాన్ని ఇతర దేశాలకు వ్యాపింప చేయడంలో ఘంటసాల బౌద్ధ క్షేత్రమునకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నాడు యోగాను అనుసరించడం వల్లే గౌతముడు బుద్ధుడు అయ్యాడని, ధ్యానముద్రలో ఉన్న గౌతముని ప్రతిమలే అందుకు నిదర్శనం అన్నారు. యోగాన్ని, ధ్యానాన్ని అనుసరించడం వల్లే గౌతమ బుద్ధుడు జ్ఞాని అయ్యాడని ఆయన పేర్కొన్నారు. యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా త్వరలో నియోజకవర్గంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జల యోగ కార్యక్రమం నిర్వహిస్తామని శాసనసభ్యులు తెలిపారు.

డిఆర్ఓ కే చంద్రశేఖరరావు మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి, యోగాను వారి జీవనశైలిలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. యోగాను ప్రతిరోజు సాధన చేయడం ద్వారా ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు తగ్గించుకోవచ్చని, యోగ సాధనకు రూపాయి ఖర్చు కూడా అవసరం లేదని, చిన్నపాటి స్థలంలో సాధన చేస్తూ ప్రయోజనం పొందవచ్చన్నారు. ప్రజలందరూ యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని, వారి జీవనశైలిలో భాగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ యోగ విన్యాసాలతో బాల బాలికలు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా యోగశిక్షకులు, చిన్నారులను అతిథులు శాలువాతో సత్కరించి అభినందించారు.

కార్యక్రమంలో బందరు ఆర్డిఓ కే స్వాతి, అవనిగడ్డ సబ్ డివిజన్ డిఎస్పీ టి విద్యశ్రీ, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి రామలక్ష్మణరావు, మెప్మా పిడి సాయిబాబు, ఎంపీడీవో సుబ్బారావు, తహసిల్దార్లు విజయ ప్రసాద్, హరినాథ్, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ జావేద్ ఖాన్, యోగ గురువులు మద్దాల చింతయ్య, నాగరాజు, శేష ప్రసన్న, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *