-“పోషకాహార ఆవశ్యకత” పై వెబ్‌నార్ నిర్వహించిన పీఐబి విజయవాడ కార్యాలయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భాధారణ సమయంలో మహిళలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని స్వీకరించడం అత్యవసరమని ఐసిడిఎస్ పీడీ కే ఉమా రాణి అన్నారు. “గర్భాధారణ- పిల్లల పెంపకంలో పోషకాహార అవసరాలు” అనే అంశంపై పత్రికా సమాచార కార్యాలయం విజయవాడ వారు నిర్వహించిన వెబినార్ లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలలో పోషణ మహ్ ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన పత్రికా సమాచార కార్యాలయం విజయవాడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విటమిన్లు, ఖనిజాలు, బలవర్ధకమైన ఆహార పదార్ధాలు వంటి సూక్ష్మ పోషకాల వాడకం తల్లి శిశువుల ఆరోగ్యానికి చాలా అవసరమని ఆమె తెలిపారు. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శిశువు తగినంత బరువు పెరగడానికి దోహదపడుతుందని అన్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత, గర్భాధారణ సమయంలో మధుమేహం వంటి వ్యాధులు రాకుండా పోషకాలతో కూడిన సమతుల ఆహారం సహాయ పడుతుందన్నారు.
పత్రికా సమాచార కార్యాలయం, విజయవాడ మీడియా & కమ్యూనికేషన్ అధికారి టి. హెన్రి రాజ్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే మొదటి గంటలోపు శిశువుకు తల్లిపాలు అందించడం ద్వారా ఆ శిశువుకు మంచి ఆరోగ్యం, అపార రోగనిరోధకశక్తి లభిస్తుందన్నారు. జన్మించిన నాటి నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా తల్లి పాలు అందించడం వల్ల శిశువులలో మానసిక, శారీరక పెరుగుదలతో పాటు సాంక్రమిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆయన వెల్లడించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎం. సునీత పోషకాహార లోపాల వల్ల రక్తహీనత టైప్ 2 డయాబెటిస్ తక్కువ బరువుతో శిశువు జన్మించడం మొదలైన అంశాలు శిశువు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు వివరించారు.
సి డి పి ఓ జి.మంగమ్మ మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి మొదలుకొని శిశువు జన్మించిన తర్వాత రెండు సంవత్సరాల వరకు అంటే సుమారు వేయి రోజులపాటు సరైన పోషకాహారం అందించడం ద్వారా పిల్లలలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని అది వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయ అధికారులు, సిబ్బందితోపాటు ఆంధ్ర ప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.