-అధికారులకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతం కావడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంటింటికీ యోగాపై ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి స్వర్ణ గ్రామ/ వార్డు సచివాలయం వరకు యోగాసనాల కార్యక్రమాలు జరిగే విధంగా సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు. దైనందిన జీవితంలో యోగాసనాలు తప్పనిసరిగా ప్రజలు అనుసరించే విధంగా శాఖాపరంగా చర్యలు ఉండాలన్నారు. 13వ అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని తిరుపతిలో వచ్చే ఏడాది జూన్ 21న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అక్కడి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో ఇప్పటి నుంచే చర్చిస్తుండాలని చెప్పారు. ‘యోగాంధ్ర- 2026’ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో బుధవారం మధ్యాహ్నం ‘వర్చువల్’ గా సమావేశమైన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అంచనాలకు మించి యోగ్రాంధ రాష్ట్ర స్థాయి కార్యక్రమం, జిల్లాల్లో జరిగిన అనుసంధాన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని, అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియచేస్తున్నానని తెలిపారు. 2025లో మాదిరిగానే 2026లో కొనసాగించిన విధంగానే కాకుండా.. ‘ఇంటింటికీ యోగా’ కింద ఏడాది పొడవునా జరిగేలా సంస్థాగత నిర్మాణం జరగాలని పేర్కొన్నారు.
ఇంటింటికీ యోగా, సంపూర్ణ యోగాకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ నేచురోపతి ప్రచార పరిషత్తు త్వరలో ఏర్పడుతుందన్నారు. దీనికనుగుణంగా సచివాలయాల స్థాయిలో శాశ్వత యోగా మందిరాలు నడిపేందుకు, యోగా పర్యవేక్షణకు జిల్లా, మండలాల స్థాయిలో అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడాన్ని ‘గోల్డెన్ ఛాన్స్ ‘గా తాను భావిస్తున్నానని తెలిపారు. ఏడాదిపొడవునా యోగా కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు. ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ 2025, 2026 లో మాదిరిగానే 2027లో తిరుపతిలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్ని జరిపేందుకు ఇప్పటినుంచే అవసరమైన చర్చలు ప్రారంభిస్తామన్నారు. ఇంటింటికీ యోగా కింద ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆయుష్ శాఖ తరఫున అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేశారు.
Prajavartha Online Telugu News