విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రావణమాసం ఆదివారం కస్తూరిభాయిపేటలో బోనాల సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు భక్తుల కోలాహలంతో, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. గుడి ప్రాంగణం మొత్తం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కమిటీ కన్వీనర్ పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని, ఇటువంటి పండుగలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలన్నారు. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం సంతోషంగా ఉందని అంతేకాకుండా భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది అనే నమ్మకం అన్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పించడంలో కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. కమిటీ సభ్యులు అందరి సహకారంతో కొన్ని సంవత్సరాలుగా అన్ని పండుగులను ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవాలయ అభివృద్ధికి సహకరించిన దాతలు చుట్టు ప్రక్కల వున్న ఆసుపత్రుల యాజమాన్యాలు, స్థానికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, టీడీపీ యువ నాయకులు బొండా రవితేజ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు అన్ని విధాలుగా సహకరిస్తున్న శ్రీకృష్ణాగ్యాస్ట్రో లివర్ సెంటర్ డాక్టర్ దీప్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రెసిడెంట్ బుర్రా వెంకన్న, సెక్రటరీ బింగి యాదయ్య, కోశాధికారి నిమ్మలకుమార్ కమిటీ సభ్యులు తదితరులు పర్యవేక్షించారు. ముఖ్య అర్చకులు భక్తులకు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Prajavartha Online Telugu News