-విశాఖపట్నం–భోగాపురం మధ్య ఏరో ఎక్స్‌ప్రెస్ సేవలపై సంతృప్తి వ్యక్తం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను ఈరోజు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ స్వయంగా ప్రయాణించి పరిశీలించారు.
భోగాపురం విమానాశ్రయంలో ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సును తనిఖీ చేసిన చైర్మన్, బస్సుల సమయపాలన, నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సేవలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి, బస్సు సర్వీసులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ, గత 15 రోజులుగా ఏరో ఎక్స్‌ప్రెస్ సేవలను వినియోగిస్తున్నామని, ట్యాక్సీలతో పోలిస్తే ఆర్టీసీ బస్సు చార్జీలు ఎంతో చౌకగా ఉండటంతో పాటు ప్రయాణం సౌకర్యవంతంగా, భద్రంగా ఉందని తెలిపారు. విమానాశ్రయం నుండి విశాఖపట్నం నగరానికి సుమారు గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉండటం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
విశాఖపట్నం నగరం నుండి భోగాపురం విమానాశ్రయానికి రెండు మార్గాల్లో ఏరో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు సమయపాలనతో నడుస్తున్నాయని, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. కొత్త సర్వీసులకు ప్రజలు పూర్తిగా అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, భవిష్యత్తులో మరింత మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించే అవకాశం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.
ప్రయాణికులు మాట్లాడుతూ, ఏరో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రజా రవాణా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణ గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
చైర్మన్ కొనకళ్ల నారాయణ కూడా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని, ఏరో ఎక్స్‌ప్రెస్ సేవల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన మరియు భద్రమైన రవాణా సేవలు అందించేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో విజయనగరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ గీత, విశాఖపట్నం రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు, గాజువాక డిపో మేనేజర్ మల్లేశ్వరరావు, విజయనగరం విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గాప్రసాద్ తదితర అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
అధికారులు, సిబ్బంది కూడా ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులో భోగాపురం విమానాశ్రయం నుండి విశాఖపట్నం నగరం వరకు ప్రయాణించి, బస్సు సేవలు, సమయపాలన మరియు ప్రయాణ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News