అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలను పాడిరైతులకు అవగాహన కలిగించాలని జాయింట్ కలెక్టర్ డా. జె. మాధవీలత ప్రమోటర్లును ఆదేశించారు. అగిరిపల్లి మండలం సగ్గూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై పాడి రైతులు, ప్రమోటర్లు, అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం ద్వారా పాడి రైతులకు పలు ప్రయోజనాలు అందుతాయన్నారు. ప్రైవేట్ పాల డైరీలు అందించే రేటు కన్నా లీటరుకు 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు అదనంగా లభిస్తున్నదని, దీనివల్ల పాడి రైతులకు నెలకు 5 వేల రూపాయలవరకు అదనపు ఆదాయం లభిస్తున్నదన్నారు. పాలు అందించిన 10 రోజులకు ఒకసారి నగదును పాడి రైతుల ఖాతాలోకి వేయడం జరుగుతుందన్నారు. పాడి పశువులకు పోషకాలతో కూడిన దాణా, పశువులకు వైద్య సదుపాయం, పాడి రైతులకు పాడి పశువుల కొనుగోలుకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, తదితర ప్రయోజనాలు ఈ పధకం ద్వారా లభిస్తాయని, వీటిని గ్రామంలోని పాడి రాయితీలు తెలియజేసి పాల సేకరణ మరింత మేర పెంచేందుకు ప్రమోటర్లు కృషి చేయాలన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కూడా జగనన్న పాలవెల్లువ పధకం ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేయాలన్నారు. మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జగనన్న పాలవెల్లువపధకం పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేలా మహిళలు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ భరత్ రెడ్డి, ఎంపిడిఓ, ఆర్బీకే సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News