Breaking News

నవరత్నాలతో పోటీ పడే స్థాయి ప్రతిపక్షాలకు లేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-31వ డివిజన్ 214 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పోటీ పడి నిలబడే స్థాయి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 31 వ డివిజన్ – 214 వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశిష్ట స్పందన లభించింది. అడుగడుగునా హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,219 గృహాలలో, 482 ఇళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. అల్లూరి సీతారామరాజు రోడ్డు, రంగారాజు స్ట్రీట్, కొండపల్లి వారి వీధి, అమ్మిరాజు స్ట్రీట్, వరుగు వారి వీధి, గొడవర్తి వారి వీధి, సుబ్బరాజు స్ట్రీట్, దేవాలయం వీధి, వానపాల వీధులలో పర్యటించి ప్రజల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు చెప్పారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నట్లు వివరించారు. పాలనా సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 96 వార్డు సచివాలయాలలో సగటున ఒక్కో సచివాలయ పరిధిలో రూ. 3 కోట్ల సంక్షేమాన్ని మూడేళ్లలో అందించినట్లు వివరించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే మాసంలో పింఛన్ ను రూ. 2,750 కు పెంచబోతున్నట్లు తెలిపారు. ఎన్నికలకు 3 నెలల ముందు ఓట్ల కోసం చంద్రబాబు పింఛన్ పెంచితే.. ఈ ప్రభుత్వం మూడేళ్ల పాటు పెంచిన పింఛన్ ను వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించిందని వివరించారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో 39 లక్షలు మాత్రమే ఉన్న ఫింఛన్లను.. శాచ్యురేషన్ పద్ధతిలో ఈ ప్రభుత్వం 62 లక్షల మందికి అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మూడేళ్లలో అందించిన సంక్షేమాన్ని పుస్తక రూపంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. అంతేగానీ గత పాలకుల్లా ముఖం చాటేయడం తమకు తెలియదన్నారు.

214 సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 3.87 కోట్ల సంక్షేమాన్ని డీబీటీ విధానంలో అందించడం జరిగిందని మల్లాది విష్ణు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 214 మందికి ప్రతినెలా రూ. 21.20 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. చేయూత ద్వారా 75 మందికి రూ. 14.06 లక్షలు., కాపు నేస్తం ద్వారా 9 మందికి రూ. 1.35 లక్షలు., అమ్మఒడి ద్వారా 330 మందికి రూ. 46.20 లక్షలు., విద్యాదీవెన ద్వారా 55 మందికి రూ. 8.67 లక్షలు., వాహనమిత్ర ద్వారా 15 మందికి రూ. 1.50 లక్షలు, వైఎస్సార్ ఆసరా ద్వారా 1,080 మందికి రూ. 79.91 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.

పర్యటనలో భాగంగా టైలరింగ్ చేస్తున్న అక్కచెల్లెమ్మలతో ముచ్చటించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆత్మవిశ్వాసం మరింత పెంచిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి విడతలో 2,021 మందికి రూ. 2.02 కోట్లు., రెండో విడతలో 1,008 మందికి రూ. 1 కోటి 80 వేల రూపాయలు మొత్తం లబ్ధిదారులకు రూ. 3 కోట్లు వారి ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. అర్హత ఉండి పథకం అందని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కుక్కలు చింపిన విస్తరి చేశాయని.. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. టీడీపీ, బీజేపి తప్పు చేస్తే ప్రశ్నిస్తానన్న పవన్.. చంద్రబాబు రైతుల రుణమాఫీ ఎగ్గొడితే ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మొన్నటి వరకు విమర్శించిన పవన్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నారా..? లేదా..? అన్న డైలామాలో ప్రస్తుతం పవన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. పవన్ ను కనీసం అసెంబ్లీకి పంపడం కూడా ప్రజలకు ఇష్టం లేదని.. కనుకనే భీమవరం, గాజువాక రెండు చోట్లా పవన్ సంగతేంటో ప్రజలు స్పష్టంగా తేల్చారని విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి గూర్చి మాట్లాడే ముందు బుద్దా వెంకన్న స్థాయి తెలుసుకుంటే మంచిదని మల్లాది విష్ణు అన్నారు. బుద్ధా మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే చట్టం చూస్తూ ఊరుకోదని మల్లాది విష్ణు అన్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అయ్యన్నపాత్రుడి అనుచిత వ్యాఖ్యల‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ముందుగా తెలుగుదేశం నేతలు సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మార్వో(నార్త్) దుర్గాప్రసాద్, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు భోగాది మురళి, పట్టాభి రామరాజు, సామంతపూడి గోవిందరాజు(చిన్నా), మానం వెంకటేశ్వరరావు, బెజ్జం రవి, అంగిరేకుల విజయ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *