Breaking News

నవ్యభారతావని నిర్మాతలను తీర్చిదిద్దే బాధ్యత విశ్వ విద్యాలయాలదే

-ఉపకులపతుల సదస్సులో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-పటిష్టమైన ఉన్నత విద్యవ్యవస్థతో దేశ అభ్యున్నతి సాధ్యం
-పరిశోధన ఆసక్తిని యువతలో పెంపొందించాలి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నవ్యభారతావని నిర్మాతలను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు స్వీకరించాలని రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరి చందన్ అన్నారు. మంగళవారం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న సౌత్ జోన్ వైస్ చాన్సలర్స్ మీట్ 2023‘ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టం కలిగి ఉందని నాస్కామ్ స్పష్టం చేసిందన్నారు. 2022 నాటికి దేశంలో 80 వేలకు పైగా స్టార్టప్ సంస్థలు ఉన్నాయన్నారు. దేశ అభివృద్దికి ఉన్నత విద్య ఎంతో ప్రధానమైన అంశంమని, భవిష్యత్ నాయకులు తయారు చేయడానికి అధునాతన జ్ఞానం, నైపుణ్యాలను అందించడం ద్వారా దేశ నిర్మాణం చేయాలన్నారు. తద్వారా బలమైన సామాజిక ఆర్ధిక వ్యవస్థను నిర్మించడం వీలవుతుందన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం నేడు ప్రధానమైన అంశమన్నారు. నూతన విద్య విధానంలో భాగంగా పరిశోధనలకు ప్రాధాన్యత పెంపుదల చేయడం జరిగిందన్నారు.

ప్రపంచ స్థాయి ర్యాంకింగ్లలో అత్యుత్తమస్థానంలో భారతీయ విశ్వవిద్యాలయాలు స్థానం సాధించాలని సూచించారు. విద్యార్థులలో పరిశోధన ఆలోచనలు, ఆసక్తిని పెంచే విధంగా ఉపకులపతులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఐయూ ప్రత్యేక సంచికను గవర్నర్ ఆవిష్కరించారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా సమిష్టిగా పనిచేయాలని దిశనిర్ధేశం తగిన చేయాలని అన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అద్యక్షుడు ఆచార్య సురంజన్ దాస్ మాట్లాడుతూ దేశీయ జ్ఞానాన్ని పరిరక్షించడం ఎంతో ప్రధానమన్నారు. ఉన్నత విద్యను ఆంగ్లంతో పాటు, స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందన్నారు. సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిట్టల్ మాట్లాడుతూ 98 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏఐయూలో 924 విశ్వవిద్యాలయాలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఉపయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. దేశంలో పరిశోధనలు, పేటెంట్ల సంఖ్య మరింత పెరగాలన్నారు. ఉన్నత విద్యమండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రవేశాల జిఈఆర్ను 27.4 నుంచి 37.2 శాతానికి వృద్ది చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా ఇంటర్ తరువాత విద్యను ఆపివేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.

ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను సమాజ ఉపయుక్తంగా, పరిశ్రమల అవసరాలకు అనుగునంగా, అంతర్జాతీయంగా అనుసంధానం చేస్తూ తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ 34 స్టార్టప్ల వేదికగా నిలుస్తోందన్నారు. నాస్ కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ 17 స్టార్టప్లను తీర్చిదిద్దిందన్నారు. స్వయం సంవృద్ది సాధించాలనే ప్రధాన మంత్రి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ఆంధ్రవిశ్వవిద్యాలయం చిత్తశుద్దితో పనిచేస్తోంది. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా, ఉన్నత విద్యమండలి ఉపాద్యక్షులు కె.రామ మోహన రావు, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆచార్య కె.రాంజీ, ఆచార్య బి.మోహన వెంకట రామ్, ఆచార్య జేమ్స్ స్టీఫెన్, డాక్టర్ ఎస్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్సిటీ తరపున, ఏఐయూ తరపున గవర్నర్ను సత్కరించారు. కార్యక్రమం ఆరంభంలో ఏయూ సంగీత విభాగం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శిన మంత్ర ముగ్ధులను చేసింది.

డిజిటల్ తాళపత్రాల ఆవిష్కరణ:
ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ వి.ఎస్ కృష్ణ గ్రంధాలయంలో దశాబ్ధాల కాలంలో ఉన్న 2.5 లక్షల తాళపత్రాలను డిజిటలైజేషన్ చేసారు. వీటిని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బటన్ నొక్కి క్లౌడ్లో అప్లోడ్ చేసారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వద్ద దశాబ్ధాలుగా 1109 మంది అందించిన 2.62 లక్షల పురాతన తాళపత్రాలు ఉండగా వీటిని బధ్రపరచడానికి భవిష్యత్ తరాలకు, పరిశోధనలకు ఉపయుక్తంగా నిలపడానికి గత రెండు సంవత్సరాలుగా ప్రత్యేక సాంకేతికత ఉపకరణాలతో 2.16 లక్షల తాళపత్రాలను డిజిటలైజేషన్ చేసారు. సంస్కృతం, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్న ఈ తాళపత్రాల జ్ఞానం అన్ని విశ్వవిద్యాలయాలు వినియోగించుకునే అవకాశం కల్పించారు. తద్వారా స్థానిక భాషలో ఈ జ్ఞానాన్ని పొందడం, భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా మలచడం సాధ్యపడుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *