Breaking News

మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేలా వైద్య ఆరోగ్యశాఖ పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్‌సిహెచ్‌ నమోదు, మాతా శిశు మరణాలు, గర్బిణుల నమోదు, బాలింతలు గర్బిణులు, చిన్నారుల్లో పోషకాహార లోపాలు ఆస్పత్రుల్లో పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల పురోగతి పై వైద్యాధికారుల నుంచి వివరాలు రాబట్టారు, గత సమావేశంలో తోట్లవల్లూరు కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారిపై చర్యలు ఏం తీసుకున్నారంటూ డిఎంహెచ్ ఓ డాక్టర్ గీతాబాయిని కలెక్టర్ ప్రశ్నించారు. కనీసం మెమోలు, వివరణ తీసుకోకపోతే ఈ సమావేశం నిర్వహించుకోవడం వలన ప్రయోజనం ఏమిటని కలెక్టర్ వైద్యాధికారులను నిలదీశారు. ప్రతి కాన్పూ ఆసుపత్రి లోనే జరిగేలా చూడాలని సూచించారు. ఎన్‌సీడీ కేసులకు వెంటనే గుర్తించి వైద్యసేవలు అందించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీడీ సేవలను పెంచాలన్నారు. పీహెచ్‌సీ ల్యాబ్‌లలో అన్ని రకాల పరీక్షలు చేయాలని, గర్భవతులను గుర్తించి మూడు నెలల్లో రిజిస్ట్రేషన్‌ చేయాలని అన్నారు. సిజేరియన్‌ కాన్పులను నిరోధించాలన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్‌ చేస్తే గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సిబ్బంది కచ్చితంగా ఆసుపత్రిలోనే ఉండాలన్నారు. ఇటీవల మరణించిన గండ్రపు కావ్య, పామర్తి దివ్య, పాతూరి నాగమణి, పసుపులేటి రమ్యశ్రీ ఆ నలుగురి మరణాల ఏ విధంగా సంభవించాయో కలెక్టర్ సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా వైద్య చికిత్స అందించిన డాక్టర్ ను ఈ మీటింగ్ పిలవకుండా, చివరిగా వైద్యం అందించిన రిఫరల్ హాస్పిటల్ వైద్యుడ్ని ఈ సమావేశానికి తీసుకురావడం ఏమిటని కలెక్టర్ మండిపడ్డారు. వారిని పిలవడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని డిఎంహెచ్ఓ ను కలెక్టర్ అడిగారు. సర్జరీ కేర్ ఏవిధంగా తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ, శస్త్ర చికిత్స అనంతరం చనిపోయిన వారి కేసులు మీరు స్టడీ చేసి తనకు సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ డీఎంహెచ్ ఓ కు సూచించారు.
గుడ్లవల్లేరుకు చెందిన పామర్తి దివ్యకు సర్జరీ చేసే ముందు ఆమెకు దేహంలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకునేందుకు వి ఎస్ ఆర్ పరీక్ష చేసి న్యుమోనియా లక్షణాలు ఎందుకు పసిగట్ట లేకపోయారని సంబంధిత వైద్యుడిని కలెక్టర్ అడిగారు. అలాగే కనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పసుపులేటి రమ్యశ్రీ మరణంపై కలెక్టర్ ఆరా తీశారు. మూడో కాన్పు కావడం, యాంటీ సైకోటిక్ మందులు ఆ పేషెంట్ వాడిన కారణంగా ఆపరేషన్ వికటించినట్లు సంబంధిత వైద్యుడు తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ ఆ జవాబుకు సంతృప్తి చెందలేదు. కృష్ణా జిల్లాలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో వైద్యులు కీలకంగా వ్యవహరించి తగు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ఏఎన్‌ఎం సంబంధిత వైద్యాధికారి ప్రతి నెలా గర్భిణి ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించడంతోపాటు సుఖ ప్రసవం నిర్వహించుకునేటట్లు జాగ్రత్తలు పాటించాలన్నారు కాన్పు ప్రమాదకరమని భావించిన కేసుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఒక్కొక్క వైద్యుడు 15 మంది గర్భిణులను ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు వారి పుట్టింటికి కాన్పు నిర్వహించు కునేందుకు వెళ్లిన సందర్భంలో స్థానిక వైద్యులతో కూడా క్రమం తప్పకుండా ఆమె ఆరోగ్య స్థితిగతులపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తల్లులు చిన్నారులకు పాలు పట్టే విధానంపై కూడా తగు సూచనలు వైద్యులు, ఎఎన్‌ఎంలు చేయాలన్నారు. గర్భిణులు కాన్పు నిర్వహణ సందర్భంలో చనిపోయినట్లయితే చనిపోవడానికి గల కారణాలను అన్వేషించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఇకపై తరచుగా జిల్లాలోని పలు ఆసుపత్రులలో ముమ్మరంగా తనఖిలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి. గీతా బాయి, డిసిహెచ్‌ డాక్టర్ శర్మిష్ట, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *