Breaking News

బాబు రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసగించడమే

-ప్రతిపక్ష నేతపై నిప్పులు చెరిగిన మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమ ముగింపు అనంతరం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. తన 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ఒక్క మహిళ మన్ననలు కూడా చంద్రబాబు పొందలేకపోయారని మల్లాది విష్ణు విమర్శించారు. మధ్యపాన నిషేధం ఎత్తివేత, అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించడం, విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు, విపరీతంగా బెల్టు షాపులు పెట్టించడం.. ఇవి అధికారంలో ఉండగా చంద్రబాబు సాధించిన ఘన విజయాలన్నారు. టీడీపీ పాలనలో మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు, సర్పంచ్‌ నుంచి జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుడి దాకా సాగించిన దౌర్జన్యకాండ అంతాఇంతా కాదన్నారు. తహసిల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే తప్పు ఆమెదేనంటూ రౌడీని వెనకేసుకొచ్చారన్నారు. నాగార్జున యూనివర్శిటీలో బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసిన వారిని కాపాడింది మీరు కాదా..? అంటూ ప్రశ్నించారు. నీ తనయుడు నారా లోకేష్ టీంలోని కొందరు మీ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తను వేధిస్తే కనీసం పిలిపించి మందలించలేకపోయారన్నారు. నగరి ఎమ్మెల్యే, సోదరి రోజాను ఎన్ని రకాలుగా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం హింసించింది ఎవరూ మర్చిపోలేదన్నారు. విజయవాడ టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులతో 9వ తరగతి బాలిక దీక్షిత ఆత్మహత్య చేసుకోగా.. నేటికీ ఆ కుటుంబం పడుతున్న వేదన వర్ణనాతీతమన్నారు.

టీడీపీ హయాంలో పెచ్చుమీరిన పచ్చ నేతల కీచక పర్వాలు
2014 నుంచి 2018 వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ప్రతి ఏటా పెరుగుతూనే వచ్చాయని మల్లాది విష్ణు అన్నారు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదైతే.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాలే 44,780 కేసులు ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడితే.. ఒక్కొక్కరికి ఒక్కో పోలీస్ ను పెట్టలేమని ఆనాడు ముఖ్యమంత్రిగా నీవు మాట్లాడిన మాటలు అప్పుడే మరిచావా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఆడబిడ్డలపై పెచ్చుమీరిన పచ్చ నేతల కీచక పర్వాన్ని జాతీయ స్థాయి సంస్థలు సైతం నిగ్గుతేల్చాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన ముగిసే నాటికి 2018 జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 8వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో సగటున 55 మందిపై నేరాలు జరిగితే.. ఏపీలో మాత్రం ప్రతిలక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని ఆనాడు నీతి ఆయోగ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించారు. చివరకు కరువు, అప్పుల బాధలు తాళలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే.. నష్టపరిహారం ఇస్తే ఆత్మహత్యలు పెరుగుతాయని పరిహారం కోరిన రైతుల భార్యలనుద్దేశించి వెక్కిరించిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. అటువంటి చంద్రబాబు భయానక పాలనను మహిళలు ఎన్నటికీ మర్చిపోరని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 2024లో మరోసారి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు:రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేష్ కీలక సమీక్ష.. గోదావరి పుష్కరాలు, ఇన్-బౌండ్ టూరిజం వృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *