Breaking News

రాష్ట్ర ఇంధన సామర్థ్య పాలసీని రూపొందించాలని ఏపీ ప్రభుత్వం యోచన

-ప్రతీ ఏటా కనిష్టంగా రూ 1200 కోట్ల విలువైన విద్యుత్ ఆదా — ప్రభుత్వ లక్ష్యం
-ప్రత్యేక ఇంధన సామర్థ్య పాలసీ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు దోహదపడుతుంది
-ఇంధన సామర్ధ్య పాలసీ ఇంధన భద్రత, 24×7 నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ,విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
-రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పునరుజ్జీవింపజేయడానికి 24×7 విద్యుత్ అత్యంత ముఖ్యమైనది
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కె ఎస్ జవహర్ రెడ్డి
-భవన,మున్సిపల్,వ్యవసాయ, పరిశ్రమల రంగాలలో ఇంధన పొదుపు కార్యక్రమాలను రూపొందించడంలో ఇంధన సామర్థ్య పాలసీ దోహదపడుతుంది– ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడంలో దోహదపడే ఇంధన సామర్థ్య రంగంలో స్పష్టమైన ఫలితాలను సాధిస్తూ దేశ స్థాయిలో ప్రశంసలు పొందిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం లో ఇంధన సామర్ధ్యాన్ని సాధించడానికి ప్రత్యేకమైన ఇంధన సామర్థ్య పాలసీని రూపొందించాలని యోచిస్తోంది. ఏటా కనీసం రూ.1200 కోట్ల మేర విలువైన విద్యుత్ ను ఆదా చేసే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించబోతోంది.

ఈ ఇంధన సామర్థ్య పాలసీ ద్వారా నిర్దేశించిన ఇంధన డిమాండ్ 67,890 మిలియన్ యూనిట్ల (2023-24 ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం)లో 25 శాతం ఇంధన పొదుపు సాదించేందుకు దోహదపడనుంది. రాష్ట్రంలోని వివిధ రంగాలలో సరికొత్త ఇంధన సంరక్షణ, సాంకేతికతలను ప్రోత్సహించడంలో ఈ పాలసీని అమలు చేయడం వల్ల ఇంధన భద్రత సాదించేందుకు, 24/7 నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ,విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇది రాష్ర్ట ఆర్ధిక రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది.

ఇంధన శాఖ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) కార్యనిర్వాహక కమిటీ సమావేశం కొద్ది రోజుల్లో జరగనుంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఏపీఎస్ఈసీఎం చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కే విజయానంద్తో దీనిపై ఆదివారం చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇంధన పొదుపు కార్యకలాపాలు మరియు ఇంధన సామర్థ్యానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలడిగి తెలుసుకున్నారు.

24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ విధానాల్లో అత్యంత ముఖ్యమైన లక్ష్యాల్లో ఇది ఒకటిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్తు ప్రధాన చోదకమన్నారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఇంధన సామర్థ్య విధానాన్ని అవలంబించడం ద్వారా ఇంధన సామర్థ్య లక్ష్యాలను తేలిగ్గా చేరుకోవచ్చన్నారు. విద్యుత్ వినియోగదారులకు మరింత నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది అనుబంధంగా మారుతుందని ప్రధాన కార్యదర్శి చెప్పారు.

ఏపీ ట్రాన్స్కో మరియు నెడ్క్యాప్ గెలుచుకున్న స్కోచ్ అవార్డులు, ఎనర్షియా అవార్డులు మరియు స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ గెలుచుకున్న ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుతో సహా గత నాలుగు నెలల స్వల్ప వ్యవధిలో ఆరు ప్రధాన అవార్డులను గెలుచుకున్నందుకు విద్యుత్ సంస్థలను ఆయన అభినందించారు. మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు భవిష్యత్లో మరింత మెరుగైన పనితీరు కనబరిచేందుకు దోహదపడుతుందన్నారు. ఈ అవార్డులన్నీ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం, ఇంధన సామర్థ్యాన్ని మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తాయని సీఎస్ అన్నారు.

ఇంధన సామర్థ్య విధానంపై ముఖ్య కార్యదర్శి అడిగిన ప్రశ్నకు విజయానంద్ సమాధానమిస్తూ, పరిశ్రమలు, భవన రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాలలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య కార్యక్రమాలను రూపొందించడంలో ఇంధన సామర్థ్య పాలసీ దోహదపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అంచనా ప్రకారం, దాదాపు 67890 మిలియన్ యూనిట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో, దాదాపు 17 వేల మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. ఇది మొత్తంలో 25 శాతంగా ఉండనుందని తెలిపారు. ఈ 17 వేల మిలియన్ యూనిట్ల పొదుపు సామర్థ్యంలో, ఏటా కనీసం 10 శాతం వంతున పొదుపు సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటే , రాష్ట్రం కనీసం రూ.1200 కోట్ల మేర విలువైన 1,700 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేయగలదని ఏపీఎస్ఈసిఎం అధికారులు అభిప్రాయపడ్డారు. ఉజాలా, పాట్ మరియు ఎల్ఈడీ వీధి దీపాలు వంటి పథకాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు రూ. 3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని తగ్గించిందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001ని సమర్థవంతంగా అమలు చేయడం మరియు కర్బన ఉద్గారాల (గ్రీన్ హౌస్ వాయువులు) గణనీయమైన తగ్గింపుతో వివిధ రంగాలలో ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడం ఈ ఇంధన సామర్ధ్య పాలసీ లక్ష్యం. ఇది నివాస, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలలో స్టార్ రేటెడ్ వంటి ఇంధన సామర్థ్య పరికరాల వినియోగం మరియు వాటి ప్రచారం పై దృష్టి సారిస్తుందని ప్రత్యేక సీఎస్ విజయానంద్ తెలిపారు.

ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీని మరియు వివిధ రంగాలకు చెందిన హెచ్ఓడిల నేతృత్వంలోని సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని పాలసీ ఉద్దేశించిందని చెప్పారు. స్టీరింగ్ కమిటీ మరియు సాంకేతిక కమిటీ పాత్రలు మరియు బాధ్యతలను నిర్వచించడం అందులో భాగమన్నారు.ఇంధన సామర్థ్యం పై అవగాహనను కల్పించడం, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వినూత్న ఫైనాన్సింగ్ మరియు మార్కెట్ పరివర్తన వ్యూహాలను రూపొందించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

అందుబాటులో ఉన్న ఇంధన వనరులను లాభదాయకంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా అన్ని రంగాలకు స్థిరమైన ఇంధన సరఫరాను అందించి తద్వారా రాష్ట్రంలో ఇంధన సుస్తిరత కు ఇంధన సామర్ధ్య పాలసీ ఎంతగానో దోహదపడుతుంది అని ఇందన శాఖ ప్రధాన కార్యదర్శి తెలిపారు. సమర్ధ వంతమైన పర్యావరణ వ్యవస్థ ను రూపొందించడానికి మరియు ఆంధ్రప్రదేశ్ ను అత్యంత ఇందన సమర్ధవంతమైన రాష్ట్రముగా అభివృద్ధి చేయడానికి ఈ పాలసీ దోహద పడుతుంది అని ఇందన శాఖ ప్రధాన కార్యదర్శి అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *