Breaking News

సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం విజయవంతం చేద్దాం…

-మహా యజ్ఞం ఏర్పాట్లపై గూగుల్ మీట్ సమావేశంలో సంబంధిత అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ పథకాల ద్వారా జీవన ప్రమాణాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్ధి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభీష్టం మేరకు ఈనెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న మహా యజ్ఞం ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండకూడదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. అష్టోత్తర శత కుందాత్మక చండీ రుద్ర రాజ శ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం నిర్వహణ ఏర్పాట్ల పై ఆదివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గూగుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతు దేవదాయ, ధర్మాదాయ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్, రహదారులు, భవనాల శాఖ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ప్రధానంగా భక్తుల రాకపోకలకు అంతరాయం లేకుండా సమన్వయం తో పనిచేయాలన్నారు .మహాత్మా గాంధీ రోడ్డు లో గల రెండవ నంబర్ గేట్ నుండి ప్రముఖులు ఈట్ స్టేట్ వైపు గల మూడవ నంబర్ గేట్ నుండి సాధారణ భక్తులు ,వాటర్ ట్యాంక్ వైపు గల గేట్ నుండి క్రతువు నిర్వహించే బ్రాహ్మణులు అధికారులు సిబ్బంది ప్రవేశించేలా మార్గాల విభజన వుంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్న రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ సదుపాయం వంటి అంశాలలో పోలీసు శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. యజ్ఞ ప్రాంగణంలో ఆధ్యాత్మిక అనుభూతి, పవిత్ర భావన కలిగేలా ఏర్పాటు చేయటం, యజ్ఞ కుండం చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణమైన భక్తి ప్రపత్తులతో యజ్ఞంలో పాల్గొనే భక్తులకు అవసరమైన మంచినీరు, పసిపిల్లలతో వచ్చేవారికి పాలు, ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వారు ఏకాగ్రతతో యజ్ఞ ఫలం పొందేందుకు అవసరమైన పూర్తిస్థాయి ఏర్పాట్లన్నీ దేవదాయ, ధర్మాదాయ శాఖ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక అకస్మాత్తుగా వర్షం వచ్చినప్పుడు భక్తులు ఇబ్బంది పడకుండా స్టేడియంలో నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రాంగణం మొత్తం చదును చేయటం, పై కప్పులు పటిష్టంగా ఉండేలా ఏర్పాట్లు, క్యూ లైన్ ల క్రమబద్ధీకరణ వంటి కీలకమైన పనులన్నీ రహదారులు, భవనాల శాఖ అధికారులు చేపట్టాలని కోరారు. యజ్ఞంలో పాల్గొనేందుకు వచ్చే భక్తులలో కొంతమంది వృద్ధులు, చిన్నారులు కూడా ఉంటారనీ, అటువంటి వారి ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు ఏర్పాట్లను చేయడంతో పాటు అంబులెన్స్, వైద్య బృందాలు, సాధారణ, అసాధారణ వ్యాధులకు అవసరమయ్యే ఔషధాలను ఆయా శిబిరాలలో ఉంచాలని ఆదేశించారు. యజ్ఞ ప్రాంగణంలో విద్యుత్ దీప కాంతులు, మైకుల ద్వారా భక్తులందరికీ యజ్ఞం సమయంలో సూచనలు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా ఎటువంటి లోపాలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి ఏడాది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసి భక్తుల మన్నలను పొందినట్లు యజ్ఞం ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ విజయ రాజు, అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, దేవాదాయ శాఖb చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎక్జిక్యూటివ్ ఇంజనీరు ఎల్. రమ, పోలీసు,రోడ్లు భవనాలు,అగ్నిమాపక ,పంచాయతీ రాజ్ సమాచార శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *