-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 17 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 24వ డివిజన్ తరిమిల నాగిరెడ్డి వీధిలో రూ. 17 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో గత చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం పోతుపోతూ పెద్దఎత్తున సమస్యలు వదిలివెళ్లిందని.. వాటన్నింటినీ సవాలుగా తీసుకుని ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం అభివృద్ధి పరుస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో పెనుమార్పు వచ్చిందని వెల్లడించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా.. సెంట్రల్ ను అభివృద్ధిలో మేటిగా నిలిపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News