గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ప్రతినిధుల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీలపై విభాగాదిపతులు వేగంగా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరంలోని కార్పొరేటర్లు తమ వార్డ్ ల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పై కమిషనర్ కి అర్జీలు అందించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకుంటే ప్రజల సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం స్పందన, ప్రతి రోజు వార్డ్ సచివాలయాల్లో మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు ప్రజా స్పందన నిర్వహిస్తున్నామన్నారు. వార్డ్ ల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పై కార్పొరేటర్లు కూడా కమిషనర్ తో చర్చించడానికి ప్రత్యేక సమయం కావాలని కోరి ఉన్నందున ప్రతి శుక్రవారం కార్పొరేటర్లు తమ వార్డ్ సంబందించిన అంశాలు చర్చించేందుకు అవకాశం ఉందన్నారు. మిగిలిన రోజుల్లో కూడా కార్పొరేటర్లకు అందుబాటులో ఉంటామని, వాట్స్ అప్ లో తెలిపినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేటర్ల నుండి అందే అర్జీలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలను క్రమ పద్దతిలో రికార్డ్ చేసి, తదుపరి చర్యలు కూడా వారికి తెలిపేలా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.అనంతరం ఇటీవల స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ వచ్చిన సందర్భంగా కమిషనర్ ను డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, కార్పొరేటర్లు పూల బోకే అందించి, శాలువాతో అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తే ప్రజల సహకారంతో నగర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Prajavartha Online Telugu News