విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జాతీయస్థాయి విశ్వవిద్యాలయాల పరిశీలన నిమిత్తం పంజాబ్ కు చెందిన మీడియా ప్రతినిధుల బృందం మంగళవారం విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అందిస్తున్న తరగతులు, ఏయే కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది.. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ విద్యాలయం ఎంతవరకు దోహదపడుతుంది.. ప్రధానంగా విదేశీ సంస్థలతో ఎంవోయులు కుదుర్చుకున్నారా.. ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణపై ఆరా తీశారు. ఇక్కడ తెలుసుకున్న అంశాలను తమ పత్రికల్లో కథనాలుగా ప్రచురించనున్నట్లు మీడియా ప్రతినిధుల బృందం సభ్యులు దల్బీర్ సింగ్, రొగిస్ సోది వెల్లడించారు. వీరికి కళాశాల నిర్వహణ తీరు, చేపడుతున్న కార్యక్రమాలను ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాస్, కళాశాల ఏవో సూర్యనారాయణ, చిన్నారావు తదితరులు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో 2019లో ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా 14 కోర్సులను అందిస్తున్నట్లు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాస్ వివరించారు. సుమారు 200 మంది వరకు ప్రస్తుతం ఇక్కడ చదువుతున్నారని తెలిపారు. నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రవేశాలు కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నామని… దాదాపు ఏడాది కాలంలో సొంతభవనాలకు తరలిస్తామని చెప్పారు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో సుమారుగా 14 మంది ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి తారక ప్రసాద్, విజయవాడకు చెందిన పత్రికా సమాచార కార్యాలయ ప్రతినిధి హెన్రీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News