Breaking News

2024-25 ఆర్థిక సంవత్సరానికి అప్పులతో స్వాగతం పలికిన జగన్‌ సర్కార్‌- కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2024-25 ఆర్థిక సంవత్సరం తొలిరోజునే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్‌బిఐ నుండి రూ.4 వేల కోట్లు అప్పుచేసి, అప్పులతో నూతన ఆర్థిక సంవత్సరానికి స్వాగతం పలికిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నానాటికీ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేస్తోంది. ఎపీ ఆస్తులు, పలు కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, ఎపీ ఫైనాన్సియల్‌ సర్వీసులు, సివిల్‌ సప్లయిస్‌, లిక్కర్‌ తదితర బాండ్ల ద్వారా రుణాలు, కార్మిక సంక్షేమ బోర్డు నిధులు, గ్రామ పంచాయితీల నిధులు మళ్లింపు, పబ్లిక్‌ ఖాతా ఫండ్‌, ట్రాన్స్‌కో, జెన్‌కోల ద్వారా తీసుకున్న మొత్తాలు తదితరాలన్నీ కలిపి ఎపీ అప్పు రూ.10 లక్షల కోట్లకు పైగా చేరింది. ఎపీని అప్పుల్లో ముంచిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదే. ఎఫ్‌ఆర్‌బిఎం రుణపరిమితికి మించి ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తుండడం రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన విధానాలకు తార్కాణం. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా అప్పులు వెదకుతున్న దుస్థితి నెలకొనడం విచారకరం. మార్చి 31నే ఆర్‌బిఐ నుంచి వెయ్యి కోట్లు అప్పుతెచ్చిన వైసిపి ప్రభుత్వం ఏప్రియల్‌ 2న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి మరో రూ.4 వేల కోట్లు అప్పుతెచ్చింది. కాగ్‌ హెచ్చరికలను సైతం బేఖాతరు చేయకుండా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోంది. ఉద్యోగులకు దాదాపు రూ.32 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి వుండగా, అప్పులు తెచ్చి అస్మదీయులకు చెల్లిస్తూ ఉద్యోగస్తులను విస్మరించింది. జగన్‌ సర్కార్‌ పరిమితికి మించి అప్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ ఎలా అనుమతిస్తున్నదని ప్రశ్నిస్తున్నాం. అన్ని విభాగాలను అప్పుల్లోముంచి ఎపీని ఆర్థికంగా దివాళా తీయించేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.
ఎన్నికల కోడ్‌ తదుపరి ఇప్పటివరకు జగన్‌ సర్కార్‌ చేసిన రూ.14,500 కోట్ల చెల్లింపులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రజలంతా జగన్మాయలను గమనించి ఎన్నికల్లో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *