విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతిని మంగళవారం నగరంలోని కలెక్టరేట్లో అధికారంగా నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ యస్. నూపుర్ అజయ్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, సిబ్బందితో కలిసి బసవేశ్వరుని 889వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ మాట్లాడుతూ ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే సమాజంలో కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని చాటి చెప్పిన “బాగేవాడి బసవేశ్వరుడి” జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు. బసవేశ్వరుడు హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకరన్నారు. అందుకనే ఆయనను విశ్వ వ్యాప్తంగా బసవన్న, బసవుడు, విశ్వగురు అని పిలుస్తారని అన్నారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాదిఅని, తదుపరి రోజుల్లో లింగాయత ధర్మాన్ని స్థాపించారన్నారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడిందన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ హైందవ సంస్కృతి మూలాలు వ్యాప్తికి ఇటువంటి వేడుకలు మూలాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరెట్ సూపరింటెండెంట్ జ్యోతి, డిప్యూటీ తహశీల్దార్ మధు ఇతర సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News