గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, పనులు జరిగిన ప్రాంతాల్లో వెంటనే డ్రైన్లు, రోడ్లు నిర్మాణ పనులు చేపట్టడానికి ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ చేపట్టిన రోడ్ విస్తరణ పనులు పూర్తి అయిన ప్రాంతాల్లో ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని డ్రైన్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పెద్ద పలకలూరు రోడ్లో నగరపాలక సంస్థ నుండి విస్తరణ పనులు పూర్తి అయ్యాయని, డ్రైన్ పనులు కూడా జరుగుతున్నాయని, ఆర్ & బి అధికారులు రోడ్ నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్ట్ కేసుల్లో కౌంటర్లు, అఫిడవిట్లు పక్కాగా నమోదు చేయాలని, కంటేమ్ట్ కాకుండా ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని, కోర్ట్ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టి.పి.ఎస్. సువర్ణ కుమార్ కు చార్జి మేమో జారీ చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. కోర్ట్ కేసుల విషయంలో లీగల్ సెల్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని, విభాగ గుమాస్తాలకు కూడా కేసులు భాధ్యత కేటాయించాలన్నారు. మీడియా డివైజ్ ఫీజుల పై సమీక్షించి, బకాయిల వసూళ్ల వేగవంతం చేయాలని, బకాయిల వసూళ్ళపై పట్టణ ప్రణాళిక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ఫీజులు చెల్లించని వారి బోర్డ్ లను తొలగించాలని, బకాయిలు చెల్లించని సంస్థల పై పోలీసు కేసులు నమోదు చేయించాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో టి.డి.ఆర్. బాండ్లు ఇవ్వడానికి ప్రాసెస్ చేయాలని, ముందుగా ఆధార్ వ్యాలిడేషన్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో పోస్టర్స్ అంటించినా, బ్యానర్స్ కట్టినా పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు, భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని పట్టణ ప్రణాలిక అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు కాలేష, బాబురావు, అజయ్ కుమార్, అశోక్ కుమార్, అజయ్ కుమార్, టి.పి.ఎస్.లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News