రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్, నందం గనిరాజు జంక్షన్ మరియు నెహ్రూ నగర్ మున్సిపల్ పాఠశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక అఘాయిత్యాలను జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు పిల్లలకు వివిధ చట్టాలపై, వారి హక్కుల పై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యా హక్కు, బాల్య వివాహ నిషేధం, పోక్సో చట్టం, మొదలగు చట్టాల గురించి వివరించారు. మంచి, చెడు స్పర్శల మధ్య తేడాను తెలియజేస్తూ ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తించడం, అనవసరంగా తాకడం వంటివి చేస్తే వారిని అడ్డుకోవాలని తెలిపారు. అలాంటి వారికి భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. వారికి ఎటువంటి న్యాయ సమస్యలున్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. మంచి, చెడు స్పర్శల మధ్య తేడా, విపత్కర పరిస్థితులు, హానికర వ్యక్తులను నుండి వారిని వారు ఎలా రక్షించుకోవాలి, ఎమర్జెన్సీ నెంబర్లు గురించి విద్యార్ధులకు తెలిసేలా పోస్టర్లను తరగతి గదులు, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు చెప్పారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నందు ఉన్న పోస్ట్ మెట్రిక్ ఎస్.టి వసతి గృహాలను సందర్శించారు. ఆయా వసతి గృహ దార్మీటరీలు, భోజనశాలలు, వంట గదులు మరియు పరిసరాలను పరిశీలించారు. విద్యార్ధులకు ప్రమాణాల ప్రకారం అన్నీ వసతులు అందించాలని, వసతి గృహ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు, అవసరమైన మరమ్మత్తులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వసతి గృహ పర్యవేక్షకులతో చెప్పారు.
Prajavartha Online Telugu News